
నథింగ్ ఫోన్ 2 లాంచింగ్‌కు రెడీ అయ్యింది. నథింగ్ ఫోన్1కి వినియోగదారులు నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రావడం.. మార్కెట్లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా పెరగడంతో ఆ కంపెనీ మరో ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. జూలై 11న అధికారికంగా మన దేశంలో నథింగ్ ఫోన్ 2 ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ ఈ- ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్‌లో దీనిని అమ్మకానికి ఉంచనుంది. అయితే అధికారిక లాంచింగ్ కన్నా ముందే ఫ్లిప్ కార్ట్ ఈ నథింగ్ ఫోన్ 2 పై ఓ ఆసక్తికర ఆఫర్ ప్రకటించింది. దీనిని ప్రీ బుక్ చేసుకున్న వారికి పలు ప్రయోజనాలను ప్రకటించింది. దీనికి ప్రీ ఆర్డర్ పాస్ అని పేరు పెట్టింది. రూ. 2000లతో ఈ ప్రీ ఆర్డర్ పాస్‌ను కొనుగోలు చేస్తే, ఫోన్ మిగిలిన వారితో పోల్చితే ముందుగానే మీకు డెలివరీ అవుతుంది. అలాగే ఆ ఫోన్ యాక్సెసరీస్ మీద కూడా భారీ తగ్గింపు అందిస్తుంది. ఒకవేళ మీరు ఆ ఫోన్ కొన్ని వాడాక నచ్చకపోతే రిటర్న్ చేసేయొచ్చు. అప్పుడు మొత్తం నగదును వెనక్కిస్తారు. ఇవన్నీ ఈ ప్రీ బుక్ పాస్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
నథింగ్ ఫోన్ 2 ను జూలై 11వ తేదీన అధికారికంగా లాంచ్ చేస్తున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ పై ప్రీ ఆర్డర్ పాస్ ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ. 2000 విలువైన ఈ ప్రీ ఆర్డర్ పాస్ కొనుగోలు చేస్తే మీకు బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేసి, వేరే కారణాల వల్ల ఆ ఫోన్ కొనుగోలు చేయకపోతే ఆ నగదు కూడా వెనక్కి ఇస్తారు. జూలై11న లాంచ్ అయిన తర్వాత జూలై 20 వరకూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తారు. అప్పటికీ కొనుగోలు చేయకపోతే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాక ఆ ఫోన్ కు సంబంధించిన ఉపకరణలు కొనుగోలు చేయాలనుకుంటే వాటిపై ఆఫర్లు ఉంటాయి. రూ.8,499 విలువైన నథింగ్ ఇయర్ (స్టిక్)ను మీరు ఆఫర్ పై రూ.4,250కే సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ.1,299 విలువైన నథింగ్ ఫోన్ (2) కేస్ ను రూ.499కే దక్కించుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు రూ.999 విలువైన నథింగ్ స్క్రీన్ ప్రొటెక్టర్‌ను రూ. 399, 45W నథింగ్ ఛార్జర్‌ను రూ. 2499కి బదులు రూ. 1,499కే కొనుగోలు చేయొచ్చు.
నథింగ్ ఫోన్ (2) లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్‌ఓసీపై ఆధారపడి పనిచేస్తుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 45W ఛార్జింగ్‌కు స్మార్ట్‌ఫోన్ మద్దతు ఇస్తుంది. ఐఫోన్ 12 ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ ద్వారా ప్రేరణ పొందిన చివరి జెన్-మోడల్ మాదిరిగానే దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. వెనుక ప్యానెల్‌లో గ్లిఫ్ మాడ్యూల్ లో అంతర్నిర్మిత ఎల్‌ఈడీ లైట్‌లను అమర్చారు. దీనిలో గ్లిఫ్ కంపోజర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. మొదటి-తరం మోడల్‌ను పోలి ఉంటుంది. స్పెసిఫికేషన్లు, డిజైన్ ప్రకారం చూస్తే దీని ధర రూ. 40,000 నుంచి రూ. 45,000 వరకు ఉంటుందని అంచనా.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..