Car Door: మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే మీ ప్రాణాలకు ముప్పే!
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కార్ల డిజైన్లలో కొత్త మార్పులు వస్తున్నాయి. అయితే ఈ అత్యాధునిక ఫీచర్లు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు తీసుకొస్తున్న టెక్నాలజీల వల్లే ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉండే 'హిడెన్ డోర్ హ్యాండిల్స్' వల్ల చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. కారు అన్-లాక్ చేసినప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. ఈ డిజైన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భద్రతాపరంగా మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు, ప్రయాణికులు మెరుగైన సౌకర్యాన్ని కల్పించేందుకు కార్లలో కంపెనీలు తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీలు కొన్ని సార్లు కస్టమర్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన హిడెన్ డోర్ హ్యాండిల్స్ కలిగిన కార్ల పరిస్థితి కూడా అలానే మారింది. కేవలం కారు అన్‌లాక్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అయ్యే ఈ డోర్ హ్యాండిల్స్ వినియోగదారులకు పెను ముప్పుగా మారాయి. కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈ ఆటోమెటిక్ డోర్ హ్యాండిల్స్ పనిచేయకపోవడంతో లోపల ఉన్న వారు బయటకు రాలేక, ఇబ్బంది పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. పవర్ ఫెయిల్యూర్ వల్ల డోర్లు లాక్ అయిపోయి సజీవ దహనమవుతున్న వార్తలు ఆందోళన పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలతో కార్లలో ‘రిట్రాక్టబుల్’ డోర్ హ్యాండిల్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు చైనా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త నిబంధనలు జారీ చేసింది.
కార్లలో ఈ ఆటోమెటిక్ హ్యాండిల్స్ వాడకంపై నిషేధం విధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా చైనా నిలిచింది. 2027 జనవరి 1 నుంచి చైనాలో అమ్ముడయ్యే ప్రతి కారుకు తప్పనిసరిగా సంప్రదాయ ‘మెకానికల్ డోర్ హ్యాండిల్స్’ కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కారులోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయినా, పవర్ కట్ అయినా చేతితో మాన్యువల్‌గా డోర్ తెరిచేలా బయట, లోపల మెకానికల్ రిలీజ్ ఆప్షన్ ఉండాలని ఆదేశించింది. డోర్ హ్యాండిల్స్ డిజైన్ ఎలా ఉండాలనే దానిపై కూడా చైనా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఆటోమొబైల్ సంస్థలకు పంపింది.
కారు బయటి డోర్ హ్యాండిల్ పట్టుకుని లాగేందుకు తగినంత స్థలం ఉండాలి. ఏ కోణం నుంచి అయినా సులభంగా డోర్ తెరిచే వీలుండాలని పేర్కొంది. లోపల ఉండే డోర్ హ్యాండిల్స్ ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా, ఎమర్జెన్సీ సమయంలో త్వరగా డోర్ తెరిచేలా డిజైన్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. టెస్లా వంటి ఎలక్ట్రిక్ కార్లు ఈ ఫ్లష్ డోర్ డిజైన్‌ను పాపులర్ చేశాయని. ఆ తర్వాత చాలా కంపెనీలు ఇదే బాట పట్టాయని తెలిపింది.
ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయంతో టెస్లా, ఇతర ఈవీ సంస్థలు తమ కార్ల డిజైన్లను మార్చుకునేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. డిజైన్ ఆకర్షణ కంటే ప్రయాణికుల ప్రాణాల రక్షణే ముఖ్యమని చైనా తేల్చిచెప్పింది. చైనాలో తయారయ్యే కార్లు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి కాబట్టి, ఈ కొత్త నిబంధనల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపైనా పడే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఈ తరహా కఠిన నిబంధనలు తీసుకొస్తాయా లేదా అనేది వేచి చూడాలి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
