
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు (Australian Scientists) తొలిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా కంగారు పిండాలను (Kangaroo Embryos) అభివృద్ధి చేసి కొత్త విజయాన్ని సాధించారు. ఒకే స్పెర్మ్ కణాన్ని గుడ్డులోకి ప్రవేశపెట్టడం ద్వారా కంగారు పిండాన్ని రూపొందించడం ఇదే తొలిసారి.
క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు డాక్టర్ ఆండ్రెస్ గాంబిని ఈ విజయాన్ని మార్సుపియల్ (marsupial species) జంతువుల భవిష్యత్తు రక్షణలో ఒక కీలక అడుగుగా అభివర్ణించారు. ఆస్ట్రేలియాలో కోలాలు, టాస్మానియన్ డెవిల్స్, వోంబాట్స్, లీడ్‌బీటర్స్ పోసమ్‌ల వంటి జాతులు అంతరించిపోతున్న పరిస్థితిలో ఈ పరిశోధన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
పరిశోధకులు ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి 20కి పైగా కంగారు పిండాలను (Kangaroo Embryos) అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగానికి వన్యప్రాణి ఆసుపత్రుల్లో మరణించిన కంగారూల నుంచి స్పెర్మ్, గుడ్డు కణాలను సేకరించారు.
తూర్పు గ్రే కంగారూలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వీటి జన్యు పదార్థం సులభంగా లభిస్తుంది. అందుకే ఈ జాతిని IVF ప్రయోగాలకు ఎంచుకున్నారు.
ICSI పద్ధతిలో కేవలం కొన్ని సజీవ స్పెర్మ్ కణాలే సరిపోతాయి. ఇది ప్రత్యేకించి కోలాలు లాంటి జంతువులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాటి స్పెర్మ్ గడ్డకట్టించిన తర్వాత దాని సామర్థ్యం తగ్గిపోతుంది. మిలియన్ల స్పెర్మ్ కణాలు అవసరం ఉండదు. కొన్ని ఉంటే సరిపోతుంది అని డాక్టర్ గాంబిని వివరించారు.
ప్రస్తుతం తూర్పు గ్రే కంగారూలకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో మరింత మెరుగైన సాంకేతికతను అభివృద్ధి చేసి ఇతర మార్సుపియల్ జాతుల రక్షణకు ఈ విధానాన్ని ఉపయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రకృతి సమతుల్యతకు జన్యు వైవిధ్యం (Genetic Diversity) ఎంతో అవసరం. మరణించిన జంతువుల నుండి జన్యు పదార్థాన్ని భద్రపరచి వాటిని సంరక్షించే కొత్త మార్గాలను అన్వేషించడమే తమ లక్ష్యమని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆస్ట్రేలియాలో గత కొన్ని దశాబ్దాల్లో 38 క్షీరద జాతులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు శాస్త్రవేత్తలు IVF సాంకేతికతను వినియోగించి వన్యప్రాణుల రక్షణలో కొత్త దారులు వేయాలని ప్రయత్నిస్తున్నారు.