Nikhat Zareen: తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్ కు అర్హత సాధించింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణం సాధించి సత్తాచాటిన నిఖత్.. వచ్చే నెలలో జరుగనున్న బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. శనివారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ ఫైనల్లో (50 కేజీల విభాగంలో) 7-0తో హర్యానా బాక్సర్ మీనాక్షిని చిత్తు చేసి కామన్వెల్త్ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతతకం నెగ్గాక సన్మానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన జరీన్..సరైన ప్రాక్టీస్ లేకున్నా తుదిపోరులో దుమ్మురేపింది. మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చిన ఈ యంగ్ బాక్సర్ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ తర్వాత. పలు కార్యక్రమాల వల్ల ప్రాక్టీస్‌కు సరైన సమయం కేటాయించలేకపోయాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పడ్డ శ్రమతో పోల్చుకుంటే 50 శాతం కూడా కష్టపడకుండానే కామన్వెల్త్‌కు అర్హత సాధించగలిగాను. అదృష్టవశాత్తూ సెలెక్షన్ ట్రయల్స్‌లో అన్నీ బౌట్లలోనూ ఏకపక్ష విజయాలే నమోదు చేసుకున్నాను’ అని బౌట్ అనంతరం చెప్పుకొచ్చిందీ యంగ్ బాక్సర్.
మేరీకోమ్ దూరం కావడంతో..
కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్ తాజాగా 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. కొత్త వెయిట్ కేటగిరీలో మారడం కాస్త ఇబ్బందిగా ఉందన్న నిఖత్.. దీనిపై మరింత దృష్టి పెడుతానని, కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేసింది. కాగా మోకాలి గాయం కారణంగా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ఈ మెగాటోర్నీకి దూరమైంది. దీంతో టోక్యోలో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహై కూడా కామన్వెల్త్ బెర్తును ఖరారు చేసుకుంది. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు జరుగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Video viral: ఆఫీసుకెళ్తున్న ఆవు, సీరియస్‌గా సిస్టమ్ వర్క్ చేసుకుంటోంది.. వీడియో చూస్తే అవాక్కే!