FIFA Rankings : ఫిఫా ర్యాకింగ్స్‎లో భారత్ పరిస్థితి దారుణం.. 8ఏళ్లలో అత్యంత చెత్త రికార్డు

ఫిఫా తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 133వ స్థానానికి పడిపోయింది. గత 8 ఏళ్లలో ఇదే అత్యంత చెత్త ర్యాంకింగ్. 2025లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడం, పేలవమైన ప్రదర్శన దీనికి కారణం. పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాక్ జట్టు మూడు స్థానాలు కిందకు పడిపోయి 201వ స్థానానికి చేరుకుంది.

FIFA Rankings : ఫిఫా ర్యాకింగ్స్‎లో భారత్ పరిస్థితి దారుణం.. 8ఏళ్లలో అత్యంత చెత్త రికార్డు
Indian Football

Updated on: Jul 10, 2025 | 8:02 PM

FIFA Rankings : క్రికెట్‌లో భారత్ ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‎లో టీమిండియాకు పెద్ద నష్టం వాటిల్లింది. ఫిఫా గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 133వ స్థానానికి పడిపోయింది. ఇది భారత ఫుట్‌బాల్ జట్టుకు గత 8 ఏళ్లలో అత్యంత చెత్త ర్యాంకింగ్. అంతకుముందు భారత జట్టు 2017-2017 సీజన్‌లో 130వ స్థానం కంటే దిగువకు వచ్చింది. ఈ ర్యాంకింగ్స్‌లో నష్టానికి ఒక ప్రధాన కారణం.. భారత్ 2025లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం.

భారత ఫుట్‌బాల్ జట్టు ఇంతకుముందు 127వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు 2025లో పేలవమైన ప్రదర్శనకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టీమిండియా 7 స్థానాలు కిందకు పడిపోయి 133వ స్థానానికి చేరుకుంది. 2025లో భారత్ ఇప్పటివరకు మొత్తం 4 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. దురదృష్టవశాత్తు ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా భారత్ కంటే తక్కువ ర్యాంకింగ్‌లో ఉన్న జట్లతోనే ఆడటం గమనార్హం.

భారత జట్టుపై ఎక్కువగా ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసినప్పుడు జట్టు ఫామ్‌పై విమర్శలు మొదలయ్యాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. భారత జట్టు తన అత్యుత్తమ ర్యాంకింగ్‌ను 1996లో సాధించింది. అప్పుడు అది 94వ స్థానానికి చేరుకుంది.

పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణం

ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 133వ స్థానంలో ఉండగా, పొరుగు దేశమైన పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాకిస్థాన్ టాప్-200 ర్యాంకింగ్స్‌లో కూడా లేదు. తాజా ర్యాంకింగ్స్‌లో పాక్ జట్టు మూడు స్థానాలు కిందకు పడిపోయి 201వ స్థానానికి చేరుకుంది. భారత మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ ప్రస్తుతం 184వ స్థానంలో ఉంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..