పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత ఆటగాళ్ల ప్రదర్శన రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. పోటీలు మొదలై 7వ రోజుకి చేరుకున్నాయి.. భారత్‌కు ఈ రోజు 21వ పతకం లభించింది. పురుషుల షాట్పుట్ఎఫ్46 విభాగంలో భారత్‌కు చెందిన సచిన్ ఖిలారీ దేశానికి పతకాన్ని అందించాడు. ఆసియా రికార్డుని సృష్టించి రజత పతకం సాధించాడు. సచిన్ సర్జేరావు ఖిలారీ అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. అయితే సచిన్ పసిడి పతకం గెలుచుకునే చాన్స్ ను కేవలం 0.06 మీటర్ల తేడాతో కోల్పోయాడు.
పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో ఫైనల్‌లో సచిన్ తొలి ప్రయత్నం 14.72 మీటర్లు, రెండో ప్రయత్నం 16.32 మీటర్లు, మూడో ప్రయత్నం 16.15 మీటర్లు, నాలుగో ప్రయత్నం 16.31 మీటర్లు, ఐదో ప్రయత్నం 16.03 మీటర్లు, ఆరో ప్రయత్నం 15.95 మీటర్లు. విసిరాడు. అయితే రెండో ప్రయత్నంలో విసిరిన 16.32 మీటర్ల ఆసియా కొత్త రికార్డుని సృష్టించింది. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు సచిన్ పేరిట మాత్రమే ఉంది. సచిన్ మే 2024లో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి ఆసియా రికార్డు సృష్టించాడు. కాగా కెనడాకు చెందిన గ్రెగ్ స్టీవర్ట్ 16.38 మీటర్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంటే సచిన్ కేవలం 0.06 మీటర్లు వెనుక బడి తృటిలో స్వర్ణం కోల్పోయాడు. అదే సమయంలో ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మహ్మద్ యాసర్ ఎనిమిదో స్థానంలో నిలవగా, రోహిత్ కుమార్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.
34 ఏళ్ల సచిన్ ఖిలారీ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన వ్యక్తి. 30 ఏళ్లలో పారాలింపిక్‌లో పతకం సాధించిన తొలి భారతీయ పురుష షాట్‌పుటర్‌గా నిలిచాడు. చేతులు బలహీనంగా ఉన్నా, బలహీనమైన కండరాలు లేదా చేతులు కదలకుండా ఉన్న అథ్లెట్ల పాల్గొనే కేటగిరీ F46. ఇందులో క్రీడాకారులు నిలబడి పోటీపడతారు. సచిన్ గురించి మాట్లాడితే తొమ్మిదేళ్ల వయసులో అతను సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో సచిన్ ఎడమ చేయి విరిగింది.
పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఏకకాలంలో ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి. గతంలో టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలతో మొత్తం 19 పతకాలను గెలుచుకుంది. ఈసారి అంటే పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో ఇప్పటికే 3 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్య పతకాలున్నాయి. అయితే ఈ పతకాల సంఖ్య మరింత పెరగవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..