
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో (World Wrestling Championship) నిర్ణీత బరువును పాటించడంలో విఫలం కావడంతో, అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది.
ఒక ఒలింపిక్ పతక విజేతపై దేశీయ సమాఖ్య ‘క్రమశిక్షణారాహిత్యం’ కింద నిషేధం విధించడం భారత క్రీడా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
జాగ్రెబ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ (2025)లో 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడాల్సి ఉన్న అమన్ సెహ్రావత్, బరువు తూచే సమయంలో (Weigh-in) 1.7 కిలోల అధిక బరువుతో ఉన్నట్టు నిర్వాహకులు గుర్తించారు. దీంతో టోర్నీలో ఒక్క బౌట్ కూడా ఆడకుండానే అమన్ అనర్హతకు గురై వెనుదిరిగాడు.
అధిక బరువు: 57 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా, అమన్ 1.7 కిలోలు అధికంగా ఉన్నాడు.
క్రమశిక్షణా చర్య: ఈ తప్పిదంపై WFI సెప్టెంబర్ 23, 2025న అమన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అతడిచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని భావించిన క్రమశిక్షణా కమిటీ, అతనిపై చర్యలు తీసుకుంది.
WFI ప్రకటన: ఒలింపిక్ పతక విజేతగా అత్యున్నత స్థాయి క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాన్ని పాటించాల్సి ఉంటుందని, బరువును నిర్వహించడంలో వైఫల్యం దేశ ప్రతిష్టను దిగజార్చిందని WFI పేర్కొంది.
ఈ నిషేధం కారణంగా 22 ఏళ్ల అమన్ సెహ్రావత్ ఒక సంవత్సరం పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌కు సంబంధించిన ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనడానికి అనర్హుడు. సెప్టెంబర్ 23, 2025 నుంచి సెప్టెంబర్ 22, 2026 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.
కాగా, ఈ నిషేధం వలన వచ్చే ఏడాది జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలు-2026 (సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు)కు అమన్ దూరమయ్యే అవకాశం ఉంది. ట్రయల్స్‌కు కూడా అనుమతించరు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..