
‘యూఎస్ఏ వర్సెస్ ఇండియా’ చెస్ మ్యాచ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ హిరు నకమురా, భారత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌పై విజయం సాధించాడు.అయితే, ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకున్న తీరు ప్రేక్షకులతోపాటు అందర్నీ విస్మయానికి గురి చేసింది. చెస్ పట్ల ప్రజలకు ఆసక్తి పెంచేందుకు నిర్వహించిన ఈ ప్రత్యేక ఈవెంట్‌లో, తన గెలుపు అనంతరం నకమురా గుకేశ్ ‘రాజు’ పావును (కింగ్‌ను) తీసుకుని ప్రేక్షకుల వైపు విసిరాడు. దీంతో షాకైన గుకేశ్ అలాగే చూస్తుండిపోయాడు. అనంతరం హిరు నకమురా మాట్లాడుతూ ‘‘గుకేశ్‌పై విజయం సాధించా. ప్రేక్షకులకు అదే చెప్పాలని అనుకున్నా. వీరి నుంచి భారీ ఎత్తున చప్పట్లు వినాలని అనుకున్నా’’ అంటూ తెలిపాడు.
చెస్ గేమ్‌ను ఒక స్టేడియం స్పోర్ట్‌గా మార్చే లక్ష్యంతో, సాంప్రదాయేతర వాతావరణంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. ఆఖరి గేమ్‌లో, వేగవంతమైన బులెట్ టైమ్ కంట్రోల్‌లో గుకేశ్‌ను నకమురా చెక్ మేట్ చేశాడు. ఈ విజయం తర్వాత నకమురా చేసిన సెలబ్రేషన్స్ తో వివాదంలో చిక్కుకున్నాడు.
HIKARU THROWS A PIECE TO THE CROWD TO CELEBRATE THE USA 5-0! @GMHikaru
What an event!! 🔥👏 @CheckmateUSAIND pic.twitter.com/LGnM8JLulJ
— Chess.com (@chesscom) October 5, 2025
గుకేశ్ పావును ప్రేక్షకుల వైపు విసిరేయడంతో.. కొంతమంది అభిమానులు, ప్రముఖ చెస్ క్రీడాకారుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. ఇది అగౌరవంగా ఉందని, గ్రాండ్‌మాస్టర్ హుందాతనం కాదని కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ మ్యాచ్ నిర్వాహకులు ఆటగాళ్లను ఈ తరహా చర్యలకు ప్రోత్సహించారని, ఇది కేవలం వినోదం కోసం చేసిన ప్రదర్శన అని నకమురా తర్వాత వివరణ ఇచ్చారు. ఎలాంటి అగౌరవం చూపించే ఉద్దేశం లేదని, ఈవెంట్‌కు కొత్తదనాన్ని తీసుకురావడానికే ఇలా చేశారని తెలిపాడు.
అమెరికా జట్టు ఈ ప్రదర్శన మ్యాచ్‌లో భారత జట్టుపై 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. నకమురా-గుకేశ్ పోరు ఈ మొత్తం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. క్రీడాకారులు టీమ్ జెర్సీలు ధరించి బాక్సింగ్ మ్యాచ్ లాగా అభిమానుల చప్పట్ల మధ్య వేదికపైకి రావడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. ఈ ప్రదర్శన ఆధునిక చెస్ పోటీలకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సూచించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..