Cricket: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కెఎల్.రాహుల్.. ఎందుకు ఇచ్చారో చెప్పిన హర్షా భోగ్లే..
భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గువహటి వేదికగా జరిగిన రెండో మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే పరుగుల సునామీ పారించిన ఈ మ్యాచ్ లో గెలుపుపై చివరి వరకు..
భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గువహటి వేదికగా జరిగిన రెండో మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే పరుగుల సునామీ పారించిన ఈ మ్యాచ్ లో గెలుపుపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగుల భారీ స్కోర్ చేయడంతో గెలుపు సులభమే అనుకున్నారు అంతా. అయితే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్లు తమ విరోచితమైన బ్యాటింగ్ తో భారీ స్కోర్ ను చేధించేలా కన్పించారు. అయితే దీపక్ చాహర్ వేసిన 17వ ఓవర్ తో పాటు, హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ లో భారీ పరుగులు ఇవ్వకపోవడంతో దక్షిణాఫ్రికా అపజయాన్ని చూడాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటికి డేవిడ్ మిల్లర్ 225.5 స్ట్రెయిక్ రేటుతో 47 బంతుల్లో 106 పరుగులు చేసి ఆకట్టకున్నాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిస్తారనేది ఆసక్తిగా మారింది. మొదట భారత్ ఆటగాడికి ఇస్తారా, దక్షిణాఫ్రికా ఆటగాడికి ఇస్తారా అనే అనుమానం అందరిలో కలిగింది. దక్షిణాఫ్రికాకు అయితే డేవిడ్ మిల్లర్ కే ఇస్తారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ భారత క్రీడాకారుడుకి ఇస్తే సూర్య కుమార్ యాదవ్ కు ఇస్తారని అనుకున్నారు క్రికెట్ అభిమానులు. కాని మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ కు భారత ఓపెనర్ బ్యాట్స్ మెన్ కెఎల్.రాహుల్ ను ఎంపిక చేశారు.
ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులే కాదు కెఎల్.రాహుల్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా కెఎల్.రాహుల్ బయటపెట్టాడు. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో అక్టోబర్ 2వ తేదీ ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్ కెఎల్.రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు చేసి, రోహిత్ శర్మతో కలిసి భారత్‌కు గొప్ప ప్రారంభాన్ని అందించాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 61 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి కారణమయ్యాడు. మరో వైపు విరాట్ కోహ్లీ కూడా 28 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో తన స్టైలిస్ బ్యాటింగ్ తో 277 స్ట్రెయిక్ రేటుతో 61 పరుగులు చేయడంతో అంతా సూర్య కుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారని భావించారు. అయితే ప్యానలిస్టులు మాత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కోసం కెఎల్.రాహుల్ ను ఎంపిక చేసి క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యపర్చారు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా వైస్ కెప్టెన్ కెఎల్.రాహుల్ మాట్లాడుతూ.. భారత జట్టు అత్యధిక స్కోరు చేయడానికి సూర్య కుమార్ యాదవవ్ ఆడిన నాక్ కారణమని, అయితే తనకు అవార్డు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ప్రజంటర్ హర్షా భోగ్లేతో అన్నారు. అయితే కెఎల్.రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు వచ్చిందో హర్షా భోగ్లే వివరించాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఇలా ఆడటం చాలా కష్టమని అన్నాడు. దీంతో కెఎల్.రాహుల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తమ పని తాము చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తామని, వన్డేల్లో మిడిల్ ఆర్డర్ లో కొన్ని ఇన్నింగ్స్ లు ఆడటం వల్ల ఓపెనింగ్ లో ఆడటం కొంచెం కష్టమైనప్పటికి.. సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్ లో ఎంతో ప్రభావాన్ని చూపించాడని తెలిపాడు కెఎల్.రాహుల్. అలాగే చివరిలో బ్యాటింగ్ కు వచ్చి 7 బంతుల్లో 17 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ తో పాటు, విరాట్ కోహ్లీని కెఎల్.రాహుల్ ఈ సందర్భంగా ప్రశంసించాడు. మొత్తం మీద తనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడంపై కెఎల్.రాహుల్ స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..