AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: రోహిత్-రింకూ విధ్వంసం.. బిష్ణోయ్ మ్యాజిక్.. 2024లో ఆఫ్ఘాన్‌తో ఆ మ్యాచ్ గుర్తుందా?

IND vs AFG: కొన్ని టీ20 మ్యాచ్‌లు ముగిసిపోయినా.. వాటి ఉత్కంఠ మాత్రం అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య 2024లో జరిగిన బెంగళూరు టీ20 కూడా అలాంటిదే. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా అక్కడి నుంచి 212 పరుగులు చేయడం.. ఆ తర్వాత మ్యాచ్ రెండు సూపర్ ఓవర్లకు వెళ్లడం.. చివర్లో బిష్ణోయ్ అద్భుతంతో భారత్ గెలవడం ఇప్పటికీ ఓ సంచలన కథే.

IND vs AFG: రోహిత్-రింకూ విధ్వంసం.. బిష్ణోయ్ మ్యాజిక్.. 2024లో ఆఫ్ఘాన్‌తో ఆ మ్యాచ్ గుర్తుందా?
Ind Vs Afg (5)
Rakesh
|

Updated on: Sep 13, 2026 | 5:43 PM

Share

IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభమవుంది. దీంతో 2024లో జరిగిన చారిత్రాత్మక పోరు మళ్లీ వార్తల్లో నిలిచింది. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు సాధించినా మ్యాచ్ టై కావడం, రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ తర్వాత టీమిండియా విజయం సాధించడం అభిమానుల మదిలో నేటికీ నిలిచిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆ పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే ఆఫ్ఘన్ బౌలర్లు విరుచుకుపడటంతో యశస్వి జైస్వాల్ 4 పరుగులు, విరాట్ కోహ్లీ సున్నా, శివం దూబే ఒక పరుగు, సంజూ శామ్సన్ డకౌట్ రూపంలో నిష్క్రమించారు. కేవలం 22 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఆ దశలో అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం రింకూ సింగ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు భారీగా పరుగులు సాధిస్తూ ఏకంగా 190 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులు చేయగా, రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఏమాత్రం తగ్గలేదు. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ 50 పరుగులు, రహమానుల్లా గుర్బాజ్ 50 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత గుల్బదిన్ నైబ్ 23 బంతుల్లో 55 పరుగులతో విరుచుకుపడగా, చివరగా మహమ్మద్ నబీ 16 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్థాన్ 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 212 పరుగులు సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసి రసవత్తరంగా మారింది.

మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన మొదటి సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 16 పరుగులు సాధించింది. 17 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన భారత జట్టు తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 6 బంతుల్లో సరిగ్గా 16 పరుగులు చేశారు. దీంతో మొదటి సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో మైదానంలో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది.

రెండోసారి నిర్వహించిన సూపర్ ఓవర్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘనిస్థాన్ విజయానికి 12 పరుగులు అవసరం కాగా, అద్భుతమైన గూగ్లీలతో రవి బిష్ణోయ్ కేవలం 3 బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్‌ను కట్టడి చేశాడు. దీంతో సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో భారత్ ఎట్టకేలకు ఘన విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us