AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్.. చరిత్రలో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన ఘనత

IND vs NZ: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించాడు. నాలుగు SENA దేశాల్లోనూ టెస్టు శతకాలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, అజారుద్దీన్ సరసన చేరాడు. సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు.

IND vs NZ: సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్.. చరిత్రలో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన ఘనత
Kl Rahul
Rakesh
|

Updated on: Nov 21, 2026 | 7:05 AM

Share

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. వన్డేలు, టీ20ల్లోనే కాదు.. టెస్టుల్లోనూ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీ సాధించాడు. 207 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజాల పేర్లతో ఉన్న రికార్డుల జాబితాలో తన పేరును చేర్చుకున్నాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు.

ఐదో భారత ఆటగాడిగా రాహుల్

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి SENA దేశాలు అంటారు. ఈ నాలుగు దేశాల్లోనూ టెస్టు సెంచరీలు సాధించడం అంత సులభం కాదు. అక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు భారత బ్యాటర్లకు పెద్ద సవాలుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ నాలుగు దేశాల్లో సెంచరీలు చేసిన ఐదో భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. అతనికంటే ముందు ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లలో మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ జాబితాలో రాహుల్ చేరడం అతని టెస్టు కెరీర్‌లో మరో పెద్ద మైలురాయి.

సచిన్ తర్వాతి స్థానంలో రాహుల్

SENA దేశాల్లో భారత ఆటగాళ్లు సాధించిన టెస్టు సెంచరీలను పరిశీలిస్తే సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 12 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ 10 సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఈ జాబితాలో 8 సెంచరీలతో సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. వీరిద్దరూ చెరో 8 సెంచరీలు సాధించారు. రాహుల్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 4, సౌతాఫ్రికాలో 2, ఆస్ట్రేలియాలో ఒకటి, న్యూజిలాండ్‌లో ఒక సెంచరీ చేశాడు.

భారత ఓపెనర్లలోనూ స్పెషల్ రికార్డు

ఈ సెంచరీతో రాహుల్ మరో ఘనత కూడా సాధించాడు. నాలుగు SENA దేశాల్లోనూ టెస్టు ఓపెనర్‌గా సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన రెండో ఆసియా ఓపెనర్ కూడా అతడే. ఇంతకుముందు పాకిస్థాన్ మాజీ ఆటగాడు సయీద్ అన్వర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టెస్టు క్రికెట్‌లో రాహుల్‌కు ఇది 13వ సెంచరీ. ఇందులో స్వదేశంలో 3, విదేశాల్లో 10 సెంచరీలు ఉన్నాయి. విదేశీ గడ్డపై రాహుల్ ఎంత నిలకడగా ఆడుతున్నాడో ఈ గణాంకాలు చెబుతున్నాయి.

జైస్వాల్‌తో మంచి ఆరంభం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 368 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ 175 పరుగులతో అజేయంగా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించారు. జైస్వాల్ 85 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్‌కు దేవదత్ పడిక్కల్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు సాధించే దిశగా సాగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us