‘నేను మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నాను… పేదవాడైన ఒక జూనియర్ క్రికెటర్‌కు మీరు సహాయం చేయండి’.. అంటూ బోగస్ కాల్ చేసి ఓ డ్రగ్స్ ఫార్మా కంపెనీకి టోకరా వేశాడో ప్రబుద్ధుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
మంత్రి కేటీఆర్ పీఏ అంటూ మోసాలు చేస్తున్న నాగరాజును సోమవారం సాయంత్రం తెలంగాణ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇంతకు ముందు కూడా అనేక కేసులు నమోదైయ్యాయి. డ్రగ్స్ ఫార్మా కంపెనీల వద్ద డబ్బు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పొల్యూషన్ బోర్డ్ నోటీసులు ఇవ్వకుండా చూస్తానని రూ.15లక్షలు స్వాహా చేసినట్లు ఇది వరకే కేసు నమోదైంది.
అంతేకాకుండా , నాగరాజుపై గతంలో ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థకు గత ఏడాది డిసెంబర్ 16న ఫోన్‌కాల్ చేసి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన బుడుమూరు నాగరాజు అనే రంజీ క్రికెట్ ప్లేయర్ అండర్ 25 ప్రపంచకప్ కు ఎంపికయ్యాడని.. ఆయనకు తక్షణం రూ.3.3 లక్షలు ఆర్థిక సాయమందించాలంటూ సదరు సంస్థకు ఫోన్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ పేరు చెప్పి మోసానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.