FIFA World Cup 2022: అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్‌.. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు తప్పని ఓటమి

అల్ బైత్ స్టేడియం వేదికగా వేలాది మంది ప్రేక్షకులు, నిర్వాహకులు, ఫిఫా అధికారులు, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమల్ అల్ థానీ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలు జరిగాయి.

FIFA World Cup 2022: అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్‌.. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు తప్పని ఓటమి
Fifa World Cup 2022
Follow us

|

Updated on: Nov 21, 2022 | 6:20 AM

ఎడారి దేశమైన ఖతార్‌ వేదికగా ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాణసంచా కాంతులతో స్టేడియం వెలిగిపోయింది. వివిధ దేశాల జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి. అల్ బైత్ స్టేడియం వేదికగా వేలాది మంది ప్రేక్షకులు, నిర్వాహకులు, ఫిఫా అధికారులు, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమల్ అల్ థానీ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్‌ సభ్యుడు జంగ్ కుక్ తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. విద్యుత్‌ కాంతులు, బాణ సంచాకు తోడు మ్యూజిక్‌ కూడా తోడు కావడంతో ఈ విజువల్స్‌ చూసిన వారంతా వావ్‌ అంటున్నారు. ప్రస్తుతం  ఫిఫా వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈక్వెడార్‌ బోణి

ఇక అల్ బైత్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖతార్‌ గ్రూప్‌-ఎలో ఈక్వెడార్‌తో తలపడింది. అయితే తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆతిథ్య ఖతార్‌ను ఈక్వెడార్‌ జట్టు 2-0 తేడాతో ఓడించింది. తొలి సగభాగంలో ఎన్నర్‌ వాలెన్సియా రెండు గోల్స్‌ కొట్టి ఈక్వెడార్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 16వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీని ఉపయోగించుకొని గోల్‌ చేసిన వాలెన్సియా, అనంతరం 30వ నిమిషంలో ఏంజెలో ప్రిసియాడో అందించిన బంతిని తలతో అద్భుతంగా గోల్‌పోస్టులోకి నెట్టాడు. చివరి వరకు ఇదే ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న ఈక్వెడార్‌ ఫిఫా ప్రపంచకప్‌లో బోణి కొట్టింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఈక్వెడార్‌ 44వ స్థానంలో ఉండగా, ఖతార్‌ 50వ స్థానంలో ఉంది. టోర్నమెంట్‌ చరిత్రలోనే ఆతిథ్య జట్టు మొదటి మ్యాచ్‌లో ఓడడం ఇదే మొదటిసారి. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు జట్ల చొప్పున 8 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ స్థాయిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..