AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England: పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లండ్ టీం..!

England: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాంగ్ టీం తరువాత ఇంగ్లండ్ టీం కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకుంది.

England: పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లండ్ టీం..!
England Cricket
Venkata Chari
|

Updated on: Sep 20, 2021 | 10:20 PM

Share

England: పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. సెక్యూరిటీ కారణాలతో న్యూజిలాండ్ టీం ఇప్పటికే పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కారణంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే సిరీస్‌ను ఇంగ్లండ్ టీం రద్దు చేసుకుంది. వచ్చే నెలలో జరిగే పాకిస్తాన్ పర్యటన నుంచి ఇంగ్లండ్ టీం కూడా తప్పుకుంది. పురుషులతోపాటు మహిళల జట్ల పర్యటనను రద్దు చేసుకుంది. భద్రతా సమస్యల మధ్య న్యూజిలాండ్ కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కివీస్ పర్యటన రద్దు అయిన మూడు రోజుల తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం ఈ నిర్ణయం ప్రకటించింది.

ఇంగ్లండ్ జట్లు అక్టోబర్ 13, 14 తేదీలలో రావల్పిండిలో రెండు ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మహిళల జట్టు అక్టోబర్ 17-21 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే అంతర్జాతీయ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది.

“ఈ వారాంతంలో పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ మహిళలతోపాటు పురుషుల పర్యటన గురించి చర్చించడానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమావేశమైంది. అక్టోబర్ నుంచి ఈ రెండు జట్ల పర్యటనను ఉపసంహరించుకోవాలని బోర్డు అయిష్టంగానే నిర్ణయించింది” అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

“మా క్రీడాకారులు, సహాయక సిబ్బంది భద్రతకే మా అత్యంత ప్రాధాన్యం. ఇది మరింత క్లిష్టమైనది” అంటూ ప్రకటించింది.

” పాకిస్తాన్‌కు వెళ్లడం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయని మాకు తెలుసు. ఇప్పటికే కోవిడ్ పరిస్థితుల్లో బయో బబుల్‌లో ఆటగాళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. రానున్న సిరీస్‌ల కోసం ఆటగాళ్లను మరింత ఒత్తిడికి గురికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది” అని పేర్కొంది.

వచ్చే నెలలో జరిగే ట్వంటీ 20 ప్రపంచకప్ కోసం పురుషుల జట్టు పాకిస్తాన్ లాంటి పరిస్థితులలో పర్యటించడం సరైనది కాదని ఈసీబీ ప్రకటించింది.

“తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ఆతిథ్యమివ్వడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన పీసీబీకి ఈ నిర్ణయం నిరాశను కలిగిస్తుందని మాకు తెలుసు” అని పేర్కొంది.

“ఇది పాకిస్తాన్‌లో క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నందుకు చింతిస్తున్నాం. 2022 కోసం మా ప్రధాన పర్యటనలపై ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నాం” అని తెలిపింది.

సెక్యూరిటీ హెచ్చరిక అంటూ న్యూజిలాండ్ శుక్రవారం పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా విరమించుకుంది. సాధారణ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే దక్షిణాసియా దేశ ఆశలకు ఇది భారీ దెబ్బ. ఇప్పటికే పాక్ మాజీలు కివీస్‌పై ఎన్నో విమర్శలు చేశారు.

ఈ పర్యటన శుక్రవారం రావల్పిండిలో జరిగే మొదటి మూడు వన్డేలతో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ జట్టు స్టేడియానికి వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుంది.

పర్యటనను ముగించాలనే న్యూజిలాండ్ క్రికెట్ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

2009 లో లాహోర్‌లో శ్రీలంక టీమ్ బస్సుపై ఇస్లామిస్ట్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అంతర్జాతీయ బృందాలు పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం రెండు దేశాలు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో సందర్శించాల్సిన ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని పాక్ బోర్డు భయపడుతోంది.

ఈ మేరకు పాక్ పిరస్థితులను క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షిస్తోందని, మరింత సమాచారం తెలిసిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడతాం అంటూ ఆసీస్ బోర్డులోని ఓ అధికారి తెలిపారు.

Also Read: KKR vs RCB Live Score, IPL 2021: 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 56/0.. శుభ్మన్ గిల్ 30, వెంకటేష్ అయ్యర్ 22 పరుగులతో బ్యాటింగ్

KKR vs RCB: కేకేఆర్‌ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఎదురుచూస్తోన్న పలు రికార్డులు.. ధోని, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలే.. అవేంటో తెలుసా?