Yash Dayal : ఐఫోన్, లాప్ టాప్ దొంగిలించింది.. నా దగ్గర నుంచి లక్షలు వసూలు చేసింది.. దయాల్ దీనగాథ
టీమిండియా పేసర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే, దయాల్ కూడా ఆ యువతిపై ఎదురు ఆరోపణలు చేశాడు. తన ఐఫోన్, ల్యాప్‌టాప్ దొంగిలించి, లక్షలు వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

Yash Dayal : టీమిండియా యువ పేసర్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న యశ్ దయాల్ పై ఒక యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు తీవ్రతను గుర్తించిన దయాల్ తనపై వచ్చిన ఆరోపణలపై తొలిసారి స్పందించాడు. తనపై కేసు నమోదు చేసిన అమ్మాయిపైనే యశ్ దయాల్ పలు ఆరోపణలు చేశాడు. యువతిపై చర్యలు తీసుకోవాలని ప్రయాగ్‌రాజ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇంతకీ యువతిపై యశ్ దయాల్ చేసిన ఆరోపణలు ఏమిటంటే, తనపై అనేక ఆరోపణలు చేసిన ఆ యువతి తన ఐఫోన్, ల్యాప్‌టాప్ దొంగిలించిందని దయాల్ ఆరోపించాడు. అంతేకాకుండా, తన నుంచి లక్షల రూపాయలు తీసుకుని దుర్వినియోగం చేసిందని కూడా పేర్కొన్నాడు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై యశ్ దయాల్ స్పందిస్తూ.. 2021లో ఈ యువతి న్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోనే మా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. మా మధ్య ఉన్న స్నేహాన్ని దుర్వినియోగం చేసుకుని, ఆ అమ్మాయి నాకు, నా కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి, చికిత్స కోసమని నా దగ్గర లక్షల రూపాయలు తీసుకుంది. ఈ డబ్బు తీసుకునేటప్పుడు వీలైనంత త్వరగా తిరిగి ఇస్తానని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. అంతేకాకుండా, ఆ అమ్మాయి నా ఐఫోన్ , ల్యాప్‌టాప్ దొంగిలించింది” అని యశ్ దయాల్ ఆరోపించాడు. ఈ విషయమై ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో మూడు పేజీల ఫిర్యాదును కూడా నమోదు చేశాడు. ఆ యువతిపై వీలైనంత త్వరగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
జులై 7న యశ్ దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇందిరాపురం నివాసి అయిన ఒక యువతి ఫిర్యాదు చేసింది. యశ్ దయాల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే యశ్ దయాల్ తనను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని చెప్పుకొచ్చింది. వారిని చాలాసార్లు కలిశానని ఆ యువతి ఆరోపించింది. ఇప్పుడు తనను పెళ్లి చేసుకోమని దయాల్‌ను అడిగినప్పుడు, అతను తనపై శారీరక దాడి చేశాడని ఆరోపిస్తూ యువతి ఫిర్యాదు నమోదు చేసింది. ఫిర్యాదు మేరకు దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీని తర్వాత యశ్ దయాల్, యువతిపై దొంగతనం, డబ్బు తీసుకున్న ఆరోపణలు చేయడం ద్వారా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ముందుముందు ఇంకేం జరుగుతుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..




