విహారి ఏమయ్యాడు? కరుణ్ నాయర్ ఎటుపోయాడు? మయాంక్‌ను ఏం చేశారు? పృథ్వీషాని ఎందుకు గ్రూమ్ చేయడంలేదు? వీటికి సమాధానాలు కావాలి. కొన్ని దశాబ్దాలుగా టీమిండియాని సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి కచ్చితంగా సమాధానాలు కావాల్సిందే. మనోళ్లు మళ్లీ షాకిచ్చారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో మళ్లీ ఓడిపోయారు. రెండేళ్ల క్రితం అదే ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇదే రకంగా ఓడారు. ఇప్పుడు ఆస్ట్రేలియా మీద.. ఆ మ్యాచ్‌ని కాపీ పేస్ట్ చేశారు తప్ప.. ఎలాంటి పురోగతి లేదు. అసలు కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు ఈ టెస్ట్ చాంపియన్‌షిప్ ఓటమికి అంతకన్న ఎక్కువే కారణాలు ఉన్నాయనాలి.
1. కెప్టెన్సీ
రోహిత్ శర్మ మంచి కెప్టెనే.. ఐపీఎల్‌లో ఐదు టెటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. వన్డేలు, టీ20 ఇంటర్నేషల్ ట్రోఫీలు అందించాడు. కానీ.. టెస్టు ఫార్మాట్ వేరు. ఇక్కడ ఆటతీరు వేరు. వ్యూహాలు వేరు. పిచ్‌ల పరిస్థితి వేరు. దేశం దాటితే పోరాట పద్దతులూ మార్చుకోవాల్సి ఉంటుంది. వన్డే వరల్డ్ కప్, టీ20వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలు అందించిన ధోనీకే ఈ ఫార్మాట్‌లో కెప్టెన్సీ తలకు మించిన భారమై.. ఏకంగా రిటైర్మెంటే ప్రకటించాడు. రోహిత్ కూడా ఈ ఫార్మాట్‌లో ఇబ్బందులు పడ్డట్టు కనిపించింది. అసలు టాస్ దగ్గరే.. రోహిత్ తప్పుచేశాడనిపించింది. టీమ్ బ్యాటింగ్‌లో రోహిత్ చేసేదేమీ లేదు కాని.. ఏ బౌలర్‌ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అదీ ఇంగ్లండ్ పిచ్‌ల మీద ఎలా ఆడించాలో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏ బ్యాటర్‌ని ఏ బౌలర్‌తో ఇబ్బంది పెట్టాలో.. ఏ బౌలర్‌ని ఏ ఎండ్ నుంచి వేయించాలో తికమకపడ్డాడు. ఫీల్డింగ్ వ్యూహాలు కూడా బెడిసికొట్టాయి.
2. టీమ్ సెలెక్షన్
వరల్డ్ నంబర్ 1 బౌలర్ అశ్విన్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. సరే.. ఉమేష్, షమీ, సిరాజ్ అంతా రైటార్మ్ బౌలర్లే. వీరి బౌలింగ్‌లో వేరియేషన్ కనిపించలేదు. లెఫ్టామ్ వేసే ఉనద్‌కత్‌ని ఉమేష్ స్థానంలో బరిలోకి దించి ఉంటే వేరేలా ఉండేదన్న కామెంట్సూ వినిపించాయి. అయితే ఉమేష్ గత ఇంగ్లండ్ సిరీస్‌లో బెటర్ పెర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల అతడివైపు మొగ్గుచూపి ఉండొచ్చు. అయితే బీసీసీఐ పంపిన టీమే అలా ఉన్నపుడు రోహిత్ మాత్రం ఏం చేయగలడు. దేశవాళీ పెర్ఫామెన్స్ కాకుండా కేవలం ఐపీఎల్ పెర్ఫామెన్స్‌ని పరిగణలోకి తీసుకుని టెస్టుల్లోకి డంప్ చేస్తున్నారు. మయాంక్ అగర్వాల్ 2022-23 రంజీ సీజన్‌లో 82యావరేజ్‌తో దాదాపు వెయ్యి పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీషా వంటి యంగ్ టాలెంట్‌ని ఇంకెప్పుడు పైకి తీసుకొస్తారు?
3. బ్యాటర్స్
మన బ్యాటింగ్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్. టాప్ టు బాటమ్ అంతా కట్టకలుపుకుని ఫెయిల్ అయ్యారు. 30-40లు కొట్టి ఇదే సూపర్ స్కోర్ అనడానికి ఇది ఐపీఎలా? అవతలి టీమ్‌లో ఇద్దరు సెంచరీలు చేస్తే.. మనోళ్లకు పిచ్‌ని అర్ధం చేసుకోడానికే ఉన్న సమయం కాస్తా అయిపోయింది. కుదురుకోడానికి చాన్సే ఇవ్వలేదు ఆసీస్ బౌలర్లు. వారి బౌలింగ్ శైలి.. యంగ్ టు సీనియర్ బౌలింగ్ ఎటాక్. వారి వేరియేషన్స్. కోచింగ్ స్టాఫ్ అంతా పక్కాగా కనిపించింది. ఎప్పటికపుడు బౌలర్లు వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లారు. ఒక్కో బ్యాటర్‌కు ఒక్కో వ్యూహాన్ని అమలు చేసి.. దొరకబుచ్చుకున్నారు. కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్‌ని రెండు సార్లు ఎలా ఔట్ చేశారో చూస్తే.. వారి వ్యూహమెంత పదునుగా ఉందో అర్ధమవుతోంది. రహానే తొలి ఇన్నింగ్స్‌లో 89రన్స్ చేసినా.. అతడికి వచ్చిన లైఫ్‌లు రోహిత్, కోహ్లీకి వచ్చుంటే సెంచరీలు చేసుకునే వారు. పుజారా గురించి మర్చిపోండి. కౌంటీ సింహం పుజారా. అసలు మ్యాచ్‌లలో ఆడని వీళ్లని తప్పిస్తే సరిపోతుందన్నది ఫ్యాన్స్ వాదన. అర్జెంటుగా పుజారా, రహానే స్థానాల్లో కుర్రాళ్లని దించాల్సిందే.
4. గాయాలు గట్రా..
యంగ్ సీనియర్ అని తేడా ఏం లేదు. గాయాలు మాత్రం కామన్‌గా మారిపోయాయి మన జట్టులో. ముందు కేఎల్‌రాహుల్‌ని ఏమనాలో అర్ధం కావడంలేదు. అక్కర్లేని రెచ్చిపోయే ఈ పులి.. అసలు మ్యాచ్‌లకు అందుబాటులోకి లేడు. ఐపీఎల్ ఆడి గాయం బారినపడి ఇప్పుడు అసలు మ్యాచ్ ఆడకుండా అయ్యాడు. ఫ్యూచర్ కెప్టెన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కాని.. ఇప్పుడు అతడి పరిస్థితి వేరేలా ఉంది. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కూడా అదే. రిషబ్ పంత్, యాక్సిడెంట్ అతడి కెరీర్‌కి శాపంగా మారింది. ఎప్పుడు కోలుకుంటాడో కూడా ఎవరికీ ఐడియా లేదు. ఇక మన ప్రధాన బౌలర్.. తురుపుముక్క.. బుమ్రా ఇక ఆడగలడా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఓ సెలెక్టర్ గతంలో బుమ్రాపై కామెంట్ చేస్తూ.. అతడు బంతిని పైకెత్తే పరిస్థితుల్లో కూడా లేడన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా మళ్లీ వచ్చేదెపుడు? టీమ్‌కు ఆడి గెలిపించేదెపుడు? అతడి ప్లేస్‌ని భర్తి చేసే బౌలర్‌ని బీసీసీఐ తయారుచేస్తోందా అంటే.. అదీలేదు. ఇది గాయాల పరిస్థితి.
5. ఐపీఎల్
మన క్రికెట్‌కు ఐపీఎల్ శాపంగా మారింది. ఎందుకంటే యంగ్ క్రికెటర్లు ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగానే వారి ఆటతీరుని మార్చుకుంటున్నారు. రంజీలు, ఇరానీ ట్రోఫీలు ఆడితే వచ్చేదేం లేదు. కనీసం ఎవడూ చూడడు. బీసీసీఐ కూడా గుర్తించదు. ఐపీఎల్‌లో ఓ నాలుగైదు మ్యాచ్‌లు ఆడితే.. నాలుగేళ్ల కెరీర్‌కి ఢోకాలేదనుకుంటున్నారు. ఇక టెస్టులకు పనికొచ్చే బ్యాటర్లు కూడా ఐపీఎల్ మోడ్‌లోకి మారదామనుకుని మొదటికే మోసపోతున్నారు. అంటే వారి ఆట అటూ ఇటూ కాకుండా పోతోంది. కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో తప్ప ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడడన్న అపవాదు ఉంది. రోహిత్ ఐపీఎల్ కెప్టెన్సీ తప్ప.. ఇక్కడ పనికిరాడని కొందరు అంటున్నారు. ఇక పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపే సూర్యకుమార్ యాదవ్ లాంటి వారిని ఎంపిక చేయడం కన్నా.. మంచి రంజీ బ్యాటర్లను తీసుకొచ్చి వారికి చాన్సులు ఇవ్వాలంటున్నారు ఇంకొందరు మాజీలు. కాని బీసీసీఐ సెలెక్టర్లకు ఎవరు చెప్పాలి? వాళ్లు జట్టుని ఎంపిక చేసే కొలమానం ఏంటి?
6. వాళ్లేరి?
టెస్టు ఫార్మాట్‌కే అంకితమైన హనుమ విహారి ఏమయ్యాడసలు? చిన్న గాయంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే.. అతడిని పూర్తిగా పక్కకు పెట్టేశారు సెలక్టర్లు. టాలెంట్ కన్నా ఐపీఎల్ పెర్ఫామెన్స్‌నే పరిగణలోకి తీసుకున్నారు. మరి సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఐదారు మ్యాచ్‌లకే పరిమితం అయ్యాడు. 2018 తర్వాత ఆడనే లేదు. ఎందుకు అంటే బీసీసీఐ దగ్గర సమాధానం లేదు. పృథ్వీషా చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయాలా? అతడిని జట్టులోకి తీసుకుని చాన్సులు ఇస్తే వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా మారతాడు. మయాంక్ మంచి ప్లేయర్. కానీ అవకాశాలు ఇవ్వలేదు. ఇక రంజీల్లో అదరగొడుతున్న బౌలర్లు ఎందరో ఉన్నారు. వారికి ఛాన్సులు ఎవరివ్వాలి?
7. ఫ్యాన్స్‌కి ఆన్సర్ ఇచ్చేదెవరు?
భారత్‌లో ఉన్న క్రికెట్ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ.. కోటాను కోట్లు దండుకునే బీసీసీఐ.. ఏనాడూ ఎవరికీ ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వరుస ఓటములు.. ఐసీసీ ఈవెంట్లు, నాకౌట్లలో వైఫల్యాలపై నోరు విప్పుతుందన్న ఆశ కూడా ఎవ్వరికీ లేదు. క్రికెటర్లు, మా ఆట మేము ఆడేశాం.. వచ్చే వన్డే సిరీస్‌లోనో.. టీ20 సిరీస్‌లోనో పులుల్లా పోరాడి దీన్ని మర్చిపోయేలా చేస్తాం అనుకుంటూ ఉంటారు. కానీ అభిమానుల అంత త్వరగా మర్చిపోలేరు. అన్నీ గుర్తుంచుకుంటారు. బాధపడతారు. మిగిలిన జట్ల ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. వంద కోట్ల భారతీయులు ఎలా తట్టుకోగలుగుతారు? బీసీసీఐ ఆన్సర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. యంగ్ టాలెంట్‌ని గుర్తించి వారిని గ్రూమ్ చేస్తే మంచి ప్లేయర్లు తయారవుతారు. బీసీసీఐ ఓసారి ఆలోచించుకోవాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..