ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్(146*), స్టీవ్ స్మిత్(95*) క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ డ్రా, టై లేదా రద్దు అయితే ఏమవుతుంది.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ఐసీసీ రూల్స్ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా, టై లేదా రద్దైతే టీమిండియా, ఆస్ట్రేలియాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. పాయింట్ల టేబుల్, ఇతర నిబంధనలతో సంబంధం లేకుండా ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి ఇక ఐదు రోజుల షెడ్యూల్‌లో ఏ ఒక్క రోజైన ఆటకు వర్షం వల్ల ఆటంకం కలిగితే.. జూన్ 12న రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ వర్షం లేకుండా 5 రోజుల ఆట సాఫీగా సాగితే.. రిజర్వ్ డే ఉండదు.
కాగా, మొదటి రోజు టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి సెషన్‌లో వికెట్లు తీసి.. జోష్ మీద ఉన్నప్పటికీ.. ఆ తర్వాత బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. వారి బ్యాటింగ్ లైనప్‌లో ఇంకా బ్యాటర్లు ఉండటంతో.. రెండో రోజు భారత్ బౌలర్లు ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి.