విరిగిన వేలుతో టీమిండియాపై వీరోచిత ఇన్నింగ్స్.. కట్ చేస్తే.. కోమాలోకి వెళ్లిన వరల్డ్ కప్ హీరో..
Damien Martyn Health Update: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యంత సొగసైన బ్యాటర్‌గా పేరుగాంచిన డానియెన్ మార్టిన్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన మెనింజైటిస్ (Meningitis) బారిన పడి, ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. వైద్యులు ఆయనను కృత్రిమ కోమాలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Damien Martyn Health Update: గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డానియెన్ మార్టిన్‌ను బ్రిస్బేన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన మెనింజైటిస్ అనే తీవ్రమైన మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వైద్యులు ఆయనను ‘ఇండ్యూస్డ్ కోమా’ (Induced Coma) లో ఉంచారు.
క్రిస్మస్ మరుసటి రోజే ఘటన.. డిసెంబర్ 26న (బాక్సింగ్ డే) మార్టిన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గోల్డ్ కోస్ట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం నిఘాలో ఉన్నారు.
ఈ వార్త తెలియగానే మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, డారెన్ లెమాన్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మార్టిన్ ప్రస్తుతం తన జీవితంలోనే అతిపెద్ద పోరాటం చేస్తున్నాడు. అతను త్వరగా కోలుకోవాలని మనమందరం ప్రార్థించాలి” అని గిల్‌క్రిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ కూడా మార్టిన్ కుటుంబానికి ధైర్యం చెబుతూ ప్రకటన విడుదల చేశారు.
మార్టిన్ కెరీర్ విశేషాలు..
డానియెన్ మార్టిన్ ఆస్ట్రేలియా తరపున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌పై విరిగిన వేలితో ఆడి 88 పరుగులు చేసిన అజేయ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అద్భుతమైన ఫుట్ వర్క్, క్లాసిక్ షాట్లకు ఆయన పెట్టింది పేరు. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన, ఆ తర్వాత అప్పుడప్పుడు కామెంటేటర్‌గానూ కనిపించేవారు.
ప్రస్తుతం 54 ఏళ్ల వయసులో ఉన్న మార్టిన్, ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




