
మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 టికెట్ విక్రయాలే నిదర్శనంగా నిలిచాయి. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి ముందుగానే దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడవ్వడం కొత్త రికార్డుగా నమోదైంది. మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టోర్నీ ప్రారంభానికి ముందే ఇంత భారీ స్థాయిలో టికెట్లు విక్రయమైన సందర్భం ఇదే మొదటిసారి.
టోర్నీ ప్రారంభానికి ఐదు రోజుల ముందే ఐసీసీ ప్రత్యేకంగా కెప్టెన్ల ఫొటోషూట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొంటున్న 12 దేశాల జట్ల కెప్టెన్లు హాజరై వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళల క్రికెట్‌పై పెరుగుతున్న ఆసక్తి భవిష్యత్తులో ఈ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఐసీసీ డైరెక్టర్, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు.
జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడనున్నాయి. 33 మ్యాచ్‌లు జరగనున్న ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ జూలై తొలి వారంలో, ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ మైదానంలో నిర్వహించనున్నారు. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా, గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌ను ఎదుర్కొననుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి