AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shabnim Ismail : రిటైర్మెంట్ ప్రకటించిన 3 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ-ఎంట్రీ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా పేసర్ వీరవిహారం

Shabnim Ismail : మూడేళ్ల రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన శబ్నిమ్ ఇస్మాయిల్ మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను కుదిపేసింది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ చరిత్రలో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.

Shabnim Ismail : రిటైర్మెంట్ ప్రకటించిన 3 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ-ఎంట్రీ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా పేసర్ వీరవిహారం
Shabnim Ismail
Rakesh
|

Updated on: Jul 03, 2026 | 8:04 AM

Share

ICC Womens T20 World Cup 2026 : మహిళల క్రికెట్ ప్రపంచంలో అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేస్తూ దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ శబ్నిమ్ ఇస్మాయిల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమె తన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ జట్టును వణికించింది. సరిగ్గా మూడేళ్ల క్రితం.. అంటే 2023 లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయిన తర్వాత ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ కోసం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని జట్టులోకి వచ్చిన శబ్నిమ్.. సెమీఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో లండన్‌లోని ది ఓవల్ మైదానాన్ని షేక్ చేసింది.

లండన్‌లోని ప్రసిద్ధ ఓవల్ క్రికెట్ మైదానంలో జూలై 2 గురువారం సాయంత్రం ఆతిథ్య ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్ డానియల్ వ్యాట్-హాడ్జ్ గట్టి పునాది వేయాలని భావించింది. ఈ టోర్నమెంట్‌లో అప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న వ్యాట్-హాడ్జ్‌పై ఇంగ్లాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కేవలం 20 బంతుల వ్యవధిలోనే కుప్పకూలింది. స్టార్ ఆల్‌రౌండర్ మరిజన్నే కాప్ ప్రమాదకరమైన వ్యాట్-హాడ్జ్ (12 పరుగులు)ను బౌల్డ్ చేయగా.. శబ్నిమ్ ఇస్మాయిల్ తన బుల్లెట్ వేగంతో అమీ జోన్స్ (2), అలిస్ క్యాప్సే (1)లను పెవిలియన్‌కు పంపి ఇంగ్లాండ్ నడ్డి విరిచింది.

ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న శబ్నిమ్ ఇస్మాయిల్‌కు ఈ మ్యాచ్‌లో తీసిన వికెట్లు కెరీర్‌లోనే అత్యంత మైలురాయిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ జోన్స్ వికెట్ తీయడం ద్వారా శబ్నిమ్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే 50 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్‌గా ఆమె విశ్వరూపం చూపించింది. కేవలం 38 ప్రపంచకప్ మ్యాచుల్లోనే ఆమె ఈ అద్భుత ఘనతను అందుకోవడం విశేషం. ఈ అల్-టైమ్ టాప్ వికెట్ల లిస్టులో ఆస్ట్రేలియా పేసర్ మేగన్ షుట్ 48 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఈ మధ్య కాలంలో క్రీడా ప్రపంచంలో లెజెండరీ ఆటగాళ్ల కంబ్యాక్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ దాదాపు 4 ఏళ్ల రిటైర్మెంట్ తర్వాత వింబుల్డన్ 2026 ద్వారా కోర్టులోకి అడుగుపెట్టింది. కానీ ఆమె కంబ్యాక్ ఆశించిన స్థాయిలో సాగకపోగా, మొదటి రౌండ్‌లోనే ఓడిపోయి నిరాశ పరిచింది. అయితే అదే లండన్ నగరంలో వింబుల్డన్ టెన్నిస్ కోర్టుకు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓవల్ క్రికెట్ స్టేడియంలో.. శబ్నిమ్ ఇస్మాయిల్ రిటైర్మెంట్ తర్వాత చేసిన కంబ్యాక్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. వయసు కేవలం నంబర్ మాత్రమేనని నిరూపిస్తూ.. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన 6 మ్యాచుల్లోనే ఆమె 8 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుత టోర్నీలో తన పార్ట్‌నర్ మరిజన్నే కాప్ (8 వికెట్లు) తో కలిసి సౌతాఫ్రికా జట్టులోనే అత్యంత విజయవంతమైన బౌలర్‌గా దూసుకుపోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us