Harbhajan Singh : గిల్ మామూలోడు కాదు.. ఆసియా కప్ సెలెక్షన్ పై భజ్జీ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్ టాలెంటెడ్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతను ఇప్పటికే వన్డే క్రికెట్‌లో ఒక సూపర్ స్టార్. ఇంగ్లాండ్‌తో టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా అతను సాధించిన విజయం, రెడ్-బాల్ క్రికెట్‌లో అతని కెపాసిటీ నిరూపించింది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించే టీ20 ఫార్మాట్‌లో గిల్ స్థానంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Harbhajan Singh : టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ గురించి ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. వన్డేలలో అప్పటికే స్టార్‌గా ఉన్న గిల్, ఇటీవల ఇంగ్లాండ్‌లో టెస్ట్ కెప్టెన్‌గా రాణించి తన సత్తా చాటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ ఉన్న టీ20 ఫార్మాట్‌లో తన ప్లేస్ ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీమిండియా గత మూడు టీ20 సిరీస్‌లలో గిల్ ఆడలేదు. కానీ, ఈసారి ఆసియా కప్‌కు అతన్ని తీసుకుంటారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గిల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీ20 జట్టులో ప్రస్తుతం అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అయితే, వీరి ప్రదర్శన వల్ల శుభ్‌మన్ గిల్‌ను తక్కువ అంచనా వేయకూడదని హర్భజన్ సింగ్ అంటున్నారు. “అవును, మన దగ్గర అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కానీ, శుభ్‌మన్ గిల్‌ను తక్కువ అంచనా వేయలేం. అతను ఏ ఫార్మాట్‌లోనైనా రాణించగల టాలెంట్ ఉన్న బ్యాట్స్‌మెన్. అతను ఒక ఆల్-ఫార్మాట్ ప్లేయర్. నా అభిప్రాయం ప్రకారం తను టీ20లో కూడా ఆడి, ఆధిపత్యం చెలాయిస్తాడు” అని హర్భజన్ టైమ్స్‌ఆఫ్‌ఇండియాతో అన్నారు.
“మనం ప్రతి బంతికి ఫోర్లు, సిక్సర్లు చూడటానికి అలవాటు పడ్డాం. కానీ, అవసరమైనప్పుడు జట్టును ఆదుకోగల, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగల బ్యాట్స్‌మెన్ కూడా అవసరం. శుభ్‌మన్‌కు డిఫెండ్ చేయగల కెపాసిటీ ఉంది. అలాగే, అవసరమైనప్పుడు అతను ఎటాక్ చేయగలడు. అతని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే ఏ ఫార్మాట్‌లోనైనా అతను పరుగులు చేయగలడు. ఐపీఎల్‌లో కూడా గిల్ ప్రతి సీజన్‌లో పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. అతను కేవలం 120, 130 స్ట్రైక్ రేట్‌తో మాత్రమే ఆడడు, 160 స్ట్రైక్ రేట్‌తో కూడా ఆడగలడు,” అని భజ్జీ పేర్కొన్నారు.
గిల్ ఇప్పటివరకు 21 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 30.42 సగటుతో 578 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 139.27. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో 15 ఇన్నింగ్స్‌లలో 50 సగటుతో 650 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 155.87. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు చేసిన అతికొద్ది మంది భారత ఆటగాళ్లలో గిల్ ఒకరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




