జింబాబ్వేతో మ్యాచ్ నుంచి అతడిని తీసేయండి: వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

టీ20 వరల్డ్ కప్ 2026లో మంచి పేరు తెచ్చుకున్న బ్యాట్స్‌మన్ అయినప్పటికీ, అభిషేక్ శర్మ ఈ టోర్నీలో తీవ్రంగా తడబడుతున్నాడు. నెట్స్‌లో బాగా ఆడుతున్నప్పటికీ మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఫామ్‌లో లేని ఓపెనర్‌ను కొనసాగించాలా? అనే ప్రశ్న అందరి ముందుంది.

జింబాబ్వేతో మ్యాచ్ నుంచి అతడిని తీసేయండి: వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
Team India

Updated on: Feb 26, 2026 | 3:21 PM

టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే ఫామ్ కోల్పోయి పరుగులు చేయలేకపోతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో భారత్ ఆడబోయే ‘మస్ట్-విన్’ మ్యాచ్‌కు ముందు, అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చి ప్రత్యామ్నాయంగా సంజూ సాంసన్‌కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు సెహ్వాగ్ సూచించాడు.

అభిషేక్ శర్మపై నమ్మకం…

ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డక్ (హ్యాట్రిక్ డక్స్)తో పెవిలియన్ చేరాడు. యునైటెడ్ స్టేట్స్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, నెదర్లాండ్స్‌లపై అతను సున్నాకే అవుట్ అయ్యాడు.

అయినా కూడా గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా అభిషేక్ శర్మపై నమ్మకాన్ని కొనసాగిస్తూ అతనికి టోర్నీలో అవకాశాలు ఇస్తూనే వచ్చింది.

“నేనైతే సంజూ సాంసన్‌ను ప్రయత్నించేవాడిని” – వీరేంద్ర సెహ్వాగ్

ఈ పరిస్థితిపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్, చెన్నైలో జరిగే జింబాబ్వే మ్యాచ్‌కు అభిషేక్ శర్మకు బ్రేక్ ఇచ్చి సంజూ సాంసన్‌ను ఆడించాలన్నాడు. “నేను ఉంటే అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చి సంజూ సాంసన్‌ను ప్రయత్నించేవాడిని. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక్కటే ప్రయోగాలు చేయగలిగే అవకాశం. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే టోర్నీ నుంచి బయటపడతారు,” అని క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.

ఈ మ్యాచ్ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ఫామ్ ఆధారంగా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయాలని ఆయన జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. “ఇంత కీలకమైన మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతోనే భారత్ బరిలోకి దిగాలి. అభిషేక్ పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాడు కాబట్టి అతనికి కొంత విరామం ఇవ్వాలి,” అని సెహ్వాగ్ చెప్పాడు.

త్వరలోనే పాత ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్న బ్యాటింగ్ కోచ్..

అయితే అభిషేక్ శర్మను ఈ కీలక మ్యాచ్‌లో పక్కన పెడతారా? అన్న ప్రశ్నకు జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మద్దతుగా మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 15 పరుగులు చేసిన విధానం తనకు ఆశాజనకంగా అనిపించిందని, అతనిపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం సరికాదని కోటక్ అన్నాడు.

“గత మ్యాచ్‌లో అభిషేక్ బాగానే కనిపించాడు. ఒక్క వ్యక్తిపై ఎక్కువగా ఆలోచించడం అవసరం లేదు. అలా చేస్తే అతనిపై ఒత్తిడి పెరుగుతుంది. మళ్లీ అతను బ్యాట్‌తో బాగా కనెక్ట్ చేయడం మొదలుపెడితే పాత అభిషేక్‌ను మళ్లీ చూస్తాం,” అని కోటక్ వ్యాఖ్యానించాడు.

“ఈ మ్యాచ్‌లో అతను తప్పకుండా రాణిస్తాడని హామీ ఇవ్వలేం. కానీ అతను పాత ఫామ్‌కు చాలా దగ్గరలోనే ఉన్నాడు,” అని కూడా కోటక్ మీడియాకు తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us