వచ్చే టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే జట్టు వచ్చి ఇలాంటి విధానంతో ఆడితే ఫలితం ఇదే ఫలితం రిపీటవుతుందని భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ప్రపంచకప్‌లో జట్టులో కొన్ని కీలక మార్పులు చేయాలని సెహ్వాగ్ బీసీసీని కోరాడు. అయితే, ఇక్కడ తాను ఎవరి పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ.. కొందరు సీనియర్ ఆటగాళ్లకు బదులుగా వచ్చే ప్రపంచ కప్‌లో యువతకు అవకాశం ఇవ్వాలని ఆయన మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది.
క్రిక్‌బజ్‌లో సెహ్వాగ్ మాట్లాడుతూ, ‘నేను మైండ్‌సెట్, ఇతర విషయాల గురించి మాట్లాడను. అయితే ఈ జట్టులో కొన్ని మార్పులను నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. వచ్చే ప్రపంచకప్‌లో కొందరి ముఖాలను చూడడం నాకు ఇష్టం లేదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆ ప్రపంచకప్‌నకు వెళ్లకపోవడాన్ని మనం చూశాం. ఎవరూ ఊహించని విధంగా కొంతమంది యువకులు వెళ్లారు. వచ్చే ప్రపంచకప్‌నకు కూడా ఇలాంటి జట్టునే ఎంపిక చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు.
సెహ్వాగ్ మాట్లాడుతూ, ‘ఈసారి రాణించలేని సీనియర్లను వచ్చే ప్రపంచకప్‌లో చూడటం నాకు ఇష్టం లేదు. సెలక్టర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే సమస్య ఏమిటంటే, ఈ సెలక్టర్లు వచ్చే ప్రపంచకప్ వరకు ఉంటారా? అప్పుడు కొత్త సెలక్షన్ ప్యానెల్, కొత్త మేనేజ్‌మెంట్, కొత్త విధానం, మారతాయా? అనేది చూడాలి. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చూడొచ్చు. వచ్చే ప్రపంచకప్‌లో కూడా ఇదే జట్టు ఇదే విధానంతో వెళ్తే మాత్రం ఫలితం కూడా అలాగే ఉంటుందని హెచ్చరించాడు.
ఈ టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఏ రకంగాను సత్తా చాటలేకపోయాడు. దినేష్ కార్తీక్ కూడా పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీల ప్రదర్శన కూడా యావరేజ్‌గా ఉంది. కేఎల్ రాహుల్ చిన్న జట్లపై మాత్రమే పరుగులు సాధించగలిగాడు. సీనియర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్ మంచి ప్రదర్శన చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..