Virat Kohli : కోహ్లీ నంబర్ వన్ ముచ్చట తీరకముందే షాక్..కివీస్ ప్లేయర్ దూకుడు మామూలుగా లేదుగా
Virat Kohli : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం అభిమానులకు పండుగలా అనిపించింది. కానీ, ఈ ఆనందం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ తన బ్యాట్‌తో కోహ్లీ సింహాసనాన్ని వణికిస్తున్నాడు.

Virat Kohli : భారత క్రికెట్ అభిమానులు గర్వపడేలా విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు చాలా కాలం తర్వాత విరాట్ ఈ ఘనత సాధించడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ 93 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, రెండో వన్డేలో విరాట్ కేవలం 23 పరుగులకే అవుట్ కావడంతో అతని పాయింట్లలో కోత పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్.. కోహ్లీకి అత్యంత సమీపంలోకి వచ్చేశాడు.
న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. మొదటి వన్డేలో 84 పరుగులతో మెరిసిన అతను, రెండో వన్డేలో ఏకంగా 131 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో అతను కోహ్లీ ర్యాంకింగ్‌కు ఎసరు పెట్టాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వద్ద 785 రేటింగ్ పాయింట్లు ఉండగా, డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అంటే వీరిద్దరి మధ్య తేడా కేవలం ఒక్క పాయింట్ మాత్రమే. ఇప్పుడు జనవరి 18న ఇండోర్‌లో జరగబోయే మూడో వన్డే ఈ నంబర్-1 పోరుకు క్లైమాక్స్‌లా మారనుంది.
మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ర్యాంకింగ్స్‌లో చుక్కెదురైంది. అతను రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ కెరీర్‌లో నంబర్-1 వన్డే బ్యాటర్‌గా నిలవడం ఇది 11వ సారి. 2013లో మొదటిసారి అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీ, ఇప్పటివరకు సుమారు 800 రోజులకు పైగా ఈ హోదాలో కొనసాగాడు. భారత బ్యాటర్లలో ఇది ఒక తిరుగులేని రికార్డు. ఇప్పుడు తన సింహాసనాన్ని కాపాడుకోవాలంటే మూడో వన్డేలో కోహ్లీ భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది.
ఇండోర్‌లో జరగబోయే ఆఖరి వన్డే కేవలం సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ మాత్రమే కాదు, ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ ఎవరో తేల్చే మ్యాచ్ కూడా. ఒకవేళ కోహ్లీ తక్కువ స్కోరుకే అవుట్ అయి, మిచెల్ మరోసారి మెరిస్తే విరాట్ తన కుర్చీని వదులుకోవాల్సి వస్తుంది. కింగ్ కోహ్లీ తన రాజ్యాన్ని కాపాడుకుంటాడో లేక కివీస్ ప్లేయర్ ఆ స్థానాన్ని లాగేసుకుంటాడో చూడాలి. ఈ ఉత్కంఠభరిత పోరు కోసం క్రికెట్ లోకం వేచి చూస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
