
IPL 2026 Final : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 31న జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ టైటిల్ గెలిచిన ఆనందంలో ఉండగానే, సోషల్ మీడియాలో మరో హార్ట్ టచింగ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అదే.. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, ఈ సీజన్ సెన్సేషన్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన అద్భుతమైన భేటీ. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో వీరిద్దరూ పంచుకున్న ఓ ప్రత్యేకమైన క్షణం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. మొదట గుజరాత్‌ను 20 ఓవర్లలో 155 పరుగులకే కట్టడి చేసిన బెంగళూరు, ఆ తర్వాత 161 పరుగులు చేసి కేవలం 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ ముందుండి జట్టును నడిపిస్తూ 75 పరుగులతో అజేయంగా నిలవడమే కాకుండా, విన్నింగ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ఆర్సీబీని చాంపియన్‌గా నిలబెట్టాడు.
మ్యాచ్ ముగిసి ప్రెజెంటేషన్ వేడుక జరగడానికి కాస్త ముందు, కెమెరాలు మైదానంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని బంధించాయి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి, సీజన్ ముగిసినా స్టేడియంలో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. విరాట్ కోహ్లీని చూడగానే ఎంతో గౌరవంతో రెండు చేతులు జోడించి నమస్కరించాడు. దానికి కోహ్లీ కూడా ఎంతో ప్రేమగా స్పందిస్తూ, ఆ చిన్నారి క్రికెటర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి భుజం తట్టాడు. అంతేకాదు, వైభవ్‌తో కాసేపు మాట్లాడి కెరీర్‌కు ఉపయోగపడే కొన్ని విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనేది బయటకు రాకపోయినా, ఈ ఫోటోలు, వీడియోలు మాత్రం ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.
Some moments in cricket are bigger than runs, wickets, or trophies. One such special moment was the meeting between Virat Kohli and Vaibhav Suryavanshi. On one side stood a modern-day legend who has inspired millions with his passion, discipline, and hunger for success. @IPL pic.twitter.com/FM8F95SsIH
— SamSiva (@chowday2009) June 1, 2026
రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫైయర్-2 లోనే నిష్క్రమించినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం ఒక సంచలనం. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం వణికించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్లో ఏకంగా 5 ప్రతిష్టాత్మక అవార్డులను ఎగరేసుకుపోయాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్, ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డులను వైభవ్ గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 48.50 అద్భుతమైన సగటుతో, 237.30 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఐపీఎల్ 2026 ముగిసి ఉండవచ్చు కానీ, వైభవ్ సూర్యవంశీ అసలు సిసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ వండర్ కిడ్ త్వరలోనే టీమిండియా జెర్సీలో కనిపించబోతున్నాడు. జూన్ 9, 2026 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న భారత్-ఏ, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల వన్డే ట్రై-సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీని ఇండియా-ఏ జట్టుకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. దీంతో ఫ్యాన్స్ ఈ బుడ్డోడి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..