Virat Kohli : మైదానంలో వింత పరికరంతో కనిపించిన విరాట్.. దాని వెనుక అసలు కథేంటో తెలుసా?

Virat Kohli : విరాట్ కోహ్లీకి ఆధ్యాత్మికతపై ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. గతంలో ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్‌ను దర్శించుకున్నారు. ఒకానొక ప్రసంగంలో ప్రేమానంద మహరాజ్ భక్తులకు ఇలాంటి కౌంటర్లను వాడుతూ నిరంతరం దైవ చింతనలో ఉండాలని సూచించారు.

Virat Kohli : మైదానంలో వింత పరికరంతో కనిపించిన విరాట్.. దాని వెనుక అసలు కథేంటో తెలుసా?
Virat Kohli

Updated on: May 13, 2026 | 5:42 PM

Virat Kohli : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కాకుండా, చేతి వేలికి ధరించిన ఒక వింత పరికరంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కోహ్లీ ఈ పరికరంతో కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. రాయ్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. డగౌట్‌లో కూర్చుని మ్యాచ్‌ను నిశితంగా గమనిస్తున్న కోహ్లీ వేలికి ఒక చిన్న ఎలక్ట్రానిక్ యంత్రం కనిపించింది. నివేదికల ప్రకారం.. ఇది ఒక డిజిటల్ ఫింగర్ కౌంటర్. సాధారణంగా దీనిని దైవ నామస్మరణ చేసేటప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు లెక్క పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. రింగులా వేలికి తగిలించుకునే ఈ పరికరానికి ఒక చిన్న స్క్రీన్, బటన్ ఉంటాయి. బటన్ నొక్కిన ప్రతిసారీ అందులో అంకె పెరుగుతుంది.

ఆధ్యాత్మిక గురువు ప్రభావమేనా?

విరాట్ కోహ్లీకి ఆధ్యాత్మికతపై ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. గతంలో ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్‌ను దర్శించుకున్నారు. ఒకానొక ప్రసంగంలో ప్రేమానంద మహరాజ్ భక్తులకు ఇలాంటి కౌంటర్లను వాడుతూ నిరంతరం దైవ చింతనలో ఉండాలని సూచించారు. కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తూ, ఒత్తిడితో కూడిన క్రికెట్ మ్యాచ్‌ల మధ్యలోనూ మానసిక ప్రశాంతత కోసం నామ జపం చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. మార్కెట్లో వంద రూపాయల లోపే దొరికే ఈ పరికరం ఇప్పుడు కోహ్లీ వాడటంతో హాట్ టాపిక్ అయ్యింది.

ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు

ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ముంబై నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య చేధనలో ఆయన గోల్డెన్ డక్ గా వెనుదిరిగారు. దీపక్ చాహర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇది ఆయనకు వరుసగా రెండో డక్ కావడం గమనార్హం. అయినప్పటికీ, ఈ సీజన్‌లో కోహ్లీ ఫామ్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 379 పరుగులు సాధించారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న బెంగళూరు జట్టు ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిస్తే సరిపోతుంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఆటలో వైఫల్యాలు ఎదురైనా, ఆధ్యాత్మికతతో మనసును నిలకడగా ఉంచుకుంటున్న కోహ్లీ తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కోహ్లీలోని ఈ కొత్త కోణం ఆయన అభిమానులకు మరింత స్ఫూర్తినిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us