
Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం నమోదైంది. క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా పిలవబడే విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 9,000 ఐపీఎల్ పరుగుల మార్కును దాటేశారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటర్‌గా ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు. స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో హోరెత్తిపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు చేయగానే ఆయన 9000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. మ్యాచ్ ప్రారంభంలో ఆచితూచి ఆడిన కోహ్లీ, ఆరో ఓవర్ చివరి బంతికి ఈ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకున్నారు. ఈ ఘనత సాధించగానే స్టేడియంలోని ప్రేక్షకులందరూ లేచి నిలబడి చప్పట్లతో విరాట్‌కు అభివాదం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ (9012) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (7183) రెండో స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్ కేవలం కోహ్లీ రికార్డే కాకుండా, ఆర్సీబీ సాధించిన భారీ విజయం కూడా గుర్తుండిపోతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. జోష్ హెజల్‌వుడ్ (4 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (3 వికెట్లు) ధాటికి కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. పవర్‌ప్లేలో ఢిల్లీ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోవడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ పవర్‌ప్లే స్కోరుగా నమోదైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపారేసింది.
బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌ను 81 బంతులు మిగిలి ఉండగానే గెలుచుకోవడం విశేషం. బంతుల పరంగా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం. దేవదత్ పడిక్కల్ 13 బంతుల్లో 34 పరుగులు చేసి విరుచుకుపడగా, కోహ్లీ 15 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కోహ్లీ తన 9 వేల పరుగుల మైలురాయి దాటగానే రెండు భారీ సిక్సర్లు బాది ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించారు. జాకబ్ బెథెల్ కూడా 11 బంతుల్లో 20 పరుగులు చేసి తన వంతు సహకారాన్ని అందించారు.
ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కోహ్లీ ఫామ్, బౌలర్ల ప్రదర్శన చూస్తుంటే ఈ సీజన్‌లో బెంగళూరు కప్పు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ఊరు ఢిల్లీలో విరాట్ ఈ ఘనత సాధించడం ఆయన అభిమానులకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఒకే జట్టు (RCB) తరపున ఆడుతూ ఇన్ని పరుగులు సాధించడం కోహ్లీకి ఆ జట్టుపై ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..