Vikas Kohli : విరాట్ కోహ్లీని విమర్శిస్తారా? రికార్డులు చూసి మాట్లాడండి..తమ్ముడికి అండగా నిలిచిన అన్న
Vikas Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం వడోదరలో సిద్ధమవుతున్నారు. అయితే మైదానం వెలుపల కోహ్లీపై జరుగుతున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా విమర్శకులపై విరుచుకుపడ్డారు.

Vikas Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం వడోదరలో సిద్ధమవుతున్నారు. అయితే మైదానం వెలుపల కోహ్లీపై జరుగుతున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా విరాట్ టెస్టు రిటైర్మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా విమర్శకులపై విరుచుకుపడ్డారు.
ఇటీవల విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడాన్ని సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. జో రూట్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు ఇంకా టెస్టుల్లో రాణిస్తుంటే, కోహ్లీ మాత్రం తన సమస్యలను సరిదిద్దుకోకుండా త్వరగా రిటైర్మెంట్ ప్రకటించారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కోహ్లీ వన్డేలు ఆడటం కొనసాగిస్తుండటంపై మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. టాప్ ఆర్డర్ బ్యాటర్లకు వన్డే ఫార్మాట్ అనేది చాలా సులభమైనదని, అదే టెస్టుల్లో పోరాడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
మంజ్రేకర్ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ, థ్రెడ్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. “కొంతమందికి విరాట్ కోహ్లీ పేరు చెప్పనిదే వాళ్ళ ఇంట్లో పప్పు అన్నం కూడా ఉడకదు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేరుగా మంజ్రేకర్ పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యల తర్వాతే వికాస్ ఇలా స్పందించడంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. విరాట్ పేరును వాడుకుని కొందరు పాపులారిటీ సంపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బయట విమర్శలు ఎలా ఉన్నా, విరాట్ కోహ్లీ మాత్రం తన ఆటపైనే దృష్టి సారించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కోహ్లీ, అదే జోరును కివీస్ పై కూడా కొనసాగించాలని చూస్తున్నారు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన విరాట్, ఢిల్లీ తరపున ఆంధ్రపై 131 పరుగులు, గుజరాత్ పై 77 పరుగులు చేసి తాను సూపర్ ఫామ్ లో ఉన్నానని నిరూపించుకున్నారు.
వడోదరలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం కోహ్లీ నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. విమర్శకుల మాటలకు మైదానంలో తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని విరాట్ పట్టుదలతో ఉన్నారు. అటు రికార్డులు, ఇటు ఫామ్ పరంగా కోహ్లీ జోరు చూస్తుంటే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
