
Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతోంది. అతనే 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. అతి చిన్న వయసులోనే బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపిస్తూ, దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన ఈ యువ కెరటం.. త్వరలోనే టీం ఇండియా జెర్సీ ధరించబోతున్నాడా? అంటే అతని కోచ్ నుంచి అవును అనే సమాధానం వినిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా తాజాగా టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ టాలెంట్ గురించి చెబుతూ.. విమానం రన్‌వే నుంచి గాల్లోకి ఎగిరిపోయింది ఇక దాన్ని ఎవరూ ఆపలేరు అని పేర్కొన్నారు. బీసీసీఐ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైభవ్ సూర్యవంశీని టీం ఇండియాలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఆయన నొక్కి చెప్పారు. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే వైభవ్ భారత జట్టులో కచ్చితంగా ఉంటాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడు?
ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్లాట్స్ అన్నీ ప్యాక్ అయి ఉన్నాయి. మరి వైభవ్ ఎవరి ప్లేస్‌లో వస్తాడనే ప్రశ్నకు కోచ్ మనీష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పెద్ద ప్లేయర్లు ఎవరి స్థానాన్ని లాక్కోరు, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఎమర్జింగ్ ఆసియా కప్‌లో కానీ, రాజస్థాన్ రాయల్స్ జట్టులో కానీ వైభవ్ తన టాలెంట్ తోనే చోటు దక్కించుకున్నాడని గుర్తు చేశారు.
అభిషేక్ శర్మ స్థానానికి ముప్పు?
టీమిండియాలో ఓపెనర్‌గా ఎవరిని పక్కన పెడతారనే ప్రశ్నకు.. మనీష్ ఓజా నేరుగా అభిషేక్ శర్మ పేరును ప్రస్తావించారు. అభిషేక్ ఆటలో నిలకడ లేకపోవడం మైనస్ అని, అందుకే వైభవ్ సూర్యవంశీని సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌లతో కలిపి ఓపెనింగ్ చేయించాలని ఆయన సూచించారు. వైభవ్ లాంటి అటాకింగ్ బ్యాటర్ జట్టులో ఉంటే పవర్‌ప్లేలో స్కోరు బోర్డు పరుగులు పెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్తు పర్యటనలే లక్ష్యం
ఐపీఎల్ 2026 తర్వాత భారత జట్టు ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ల్లో వైభవ్ సూర్యవంశీని టీ20 ఫార్మాట్‌లో ఆడించాలని కోచ్ మనీష్ బీసీసీఐని కోరుతున్నారు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా వైభవ్‌కు ఉందని, అతన్ని ఎంత త్వరగా టీమిండియాలోకి తెస్తే అంత మంచిదని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..