
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరపున వైభవ్ సూర్యవంశీ ఆడే విషయంపై తుది నిర్ణయం భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌దే కానుంది. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య ఫైనల్ జరగనుంది. టీ20 జట్టులో ఉన్న వైభవ్‌తో పాటు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫైనల్లో పాల్గొనాలా లేదా అన్నది గంభీర్ ఆమోదంపై ఆధారపడి ఉంది. మరోవైపు కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్‌లను మాత్రం ఫైనల్ ఆడాలని జాతీయ సెలక్టర్లు కోరారు. ప్రస్తుతం వారికి పోటీ క్రికెట్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత టీ20 జట్టు సెప్టెంబర్ 9 లేదా 10న దిల్లీలో సమావేశం కానుంది.
వైభవ్, ఇషాన్, తిలక్ ముగ్గురూ ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఉన్నారు. టీ20 జట్టు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9 లేదా 10న దిల్లీకి చేరాలని గంభీర్ కోరితే వారు దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడలేరు. ఫైనల్ పూర్తయ్యాక సెప్టెంబర్ 10 రాత్రి దిల్లీకి రావడానికి అనుమతిస్తే మాత్రం చెన్నై మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
కేఎల్ రాహుల్, పడిక్కల్, సిరాజ్ చివరిసారిగా ఆగస్టు 27న మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత వారి తదుపరి అంతర్జాతీయ మ్యాచ్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఉంది. అందువల్ల మధ్యలో దొరికిన దేశవాళీ మ్యాచ్ అవకాశాన్ని వినియోగించుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను చెన్నైలో ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇదే సమయంలో ఆయన కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. పొడిగింపుపై బీసీసీఐలో చర్చ జరగాల్సి ఉంది.
ఇక ఆసియా క్రీడల కోసం మయాంక్ యాదవ్, కార్తిక్ త్యాగి, మొహ్సిన్ ఖాన్‌లకు జపాన్ వీసాల కోసం బీసీసీఐ దరఖాస్తు చేసింది. భారత పురుషుల జట్టు నెట్ బౌలర్లుగా వీరిని ఉపయోగించాలన్న కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అభ్యర్థన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..