IND vs IRE: టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో రగడ.. వైభవ్ కోసం ఐర్లాండ్ బోర్డు పై గౌతమ్ గంభీర్ సీరియస్
IND vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో సౌకర్యాల కొరతపై గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి కొనసాగుతుండగా, తుది జట్టులో చోటు దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

IND vs IRE: భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బెల్ఫాస్ట్ చేరుకున్న టీమిండియాకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడి ప్రాక్టీస్ మైదానంలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెట్స్ ప్రాక్టీస్ కోసం కేటాయించిన ఒక పిచ్‌పై బౌలర్ వెనుక ఉండాల్సిన సైట్-స్క్రీన్ లేకపోవడాన్ని భారత సపోర్ట్ స్టాఫ్ గుర్తించారు. వైట్ బాల్ క్రికెట్ లో బ్యాటర్లకు బంతి స్పష్టంగా కనిపించాలంటే ఈ స్క్రీన్ చాలా ముఖ్యం. ఇది లేకపోవడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.
ఈ లోపాన్ని గమనించిన టీమిండియా మేనేజ్‌మెంట్ వెంటనే ఐర్లాండ్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేసింది. పిచ్ సౌకర్యాలలో లోపాలు ఉన్న మాట నిజమేనని, అయితే భారత సపోర్ట్ స్టాఫ్ దీనిని ఐరిష్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేశారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తొలి మ్యాచ్‌కు ముందు తగినంత ప్రాక్టీస్ సమయం ఇవ్వాలని గంభీర్ భావించినప్పటికీ, ఈ సాంకేతిక సమస్య కారణంగా ప్రాక్టీస్ సెషన్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
రాజస్థాన్ రాయల్స్ స్టార్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగితే, భారత్ తరఫున అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డు సరసన నిలుస్తాడు. నెట్స్ లో సూర్యవంశీ దాదాపు 45 నిమిషాల పాటు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఫాస్ట్ బౌలర్లతో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ వంటి టాప్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అందరినీ ఆకట్టుకున్నాడు.
తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనా?
సూర్యవంశీ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, టీమిండియా ప్రస్తుత టాప్ ఆర్డర్ సమీకరణాలు అతనికి ప్రతిబంధకంగా మారాయి. ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం విపరీతమైన పోటీ ఉంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఇప్పటికే రేసులో ఉన్నారు. ముఖ్యంగా సంజూ, అభిషేక్ జంట ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత్‌కు ఎన్నో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలను అందించారు. కాబట్టి ఫామ్‌లో ఉన్న వారిని కాదని వైభవ్‌ను జట్టులోకి తీసుకోవడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది.
బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు
వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ టూర్ లో బరిలోకి దిగడంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైభవ్‌కు కచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. కానీ కేవలం ఒక కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం, ఇప్పటికే జట్టు కోసం పరుగులు సాధిస్తున్న ఆటగాడిని డ్రాప్ చేయడం ఎంతవరకు న్యాయం? ఒకరికి అవకాశం ఇస్తూ మరొకరికి అన్యాయం చేయడం సరికాదు. దీనిపై తుది నిర్ణయం పూర్తిగా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలపైనే ఆధారపడి ఉంటుంది” అని కోటక్ స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ రికార్డు
వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో పక్కన పెడితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో అతను సృష్టించిన విధ్వంసం సామాన్యమైనది కాదు. ఈ సీజన్ లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ లో 46.50 సగటుతో, 237.30 అనే కళ్ళు చెదిరే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు ఎంపికైన ఈ లీఫ్టీ బ్యాటర్ గనుక బెల్ఫాస్ట్ వన్డే లేదా టీ20 లో మైదానంలోకి అడుగుపెడితే పరుగుల వరద పారించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
