టీ20 ఫార్మాట్ వచ్చాకా బ్యాటర్ల దూకుడు మరింతగా పెరిగింది. బౌలర్లు ఈ ఫార్మాట్‌లో అప్పుడప్పుడు సత్తా చాటుతూ, సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. అయితే, ఏదైనా ఫార్మాట్‌లో మెయిడెన్ ఓవర్ బౌలింగ్ చేయడం అంటే, బౌలర్లకు ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వన్డేలు, టీ20ల్లో ఇలా మెయిడీన్ చేయడం అంటే మాములు విషయం కాదు. అయితే, ఒక బౌలర్ వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు వేశాడని మీకు తెలిస్తే, కచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి రికార్డును నమ్మడం ఎవరికైనా కష్టమే. క్రికెట్ చరిత్రలో అత్యంత డేంజరస్ బౌలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత క్రికెటర్ బాపు నాదకర్ణి పేరు మీకు తెలుసా. ఈ అద్భుతమైన రికార్డు నమోదు చేసింది ఇతనే. వరుసగా 126 బంతుల్లో ఒక్క పరుగు కోసం బ్యాట్స్‌మెన్స్ తహతహలాడిపోయారు. నాదకర్ణి ఈ రికార్డు 60 ఏళ్లుగా అలాగే ఉండిపోయింది. 1964లో ఇంగ్లండ్ జట్టుపై ఈ ఘనత సాధించి అద్భుతం చేశాడు.
1964లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడింది. బాపు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు. మద్రాస్ (చెన్నై) కార్పొరేషన్ స్టేడియంలో ఈ రికార్డ్ నమోదైంది. టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 21 ఓవర్లు, అంటే 126 బంతులు బౌలింగ్ చేశాడు. అందులో ఒక్క పరుగు కూడా రాకపోవడం గమానార్హం. బాపు వేసిన మొత్తం 32 ఓవర్లలో 27 మెయిడిన్లు కాగా, 21 వరుసగా మెయిడిన్లు ఉన్నాయి. 32 ఓవర్ల స్పెల్‌లో బాపు కేవలం 5 పరుగులు మాత్రమే వెచ్చించాడు.
టీమిండియా తరపున బాపు 47 టెస్టులు ఆడాడు. 9165 బంతులు బౌల్ చేశాడు. ఇందులో 2559 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని పేరిట 88 వికెట్లు ఉన్నాయి. ఈయన టెస్ట్ కెరీర్‌లో ఓవర్‌కు 1.67 చొప్పున పరుగులు ఇచ్చాడు.