Indian Cricket fans: ఒక్క రోజే మూడు శుభవార్తలతో ఆనందంలో మునిగిపోయారు క్రికెట్ లవర్స్. పాక్‌పై భారత మహిళా జట్టు ఘన విజయం, శ్రీలంకను చిత్తు చేసిన టెస్టు టీం, ఐపీఎల్ 2022(Ipk 2022) ఫుల్ షెడ్యూల్ వంటి వార్తలతో ఆనందంలో మునిగితేలుతున్నారు క్రికెట్ అభిమానులు. ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో ఇండియన్ టీమ్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్డేల్లో ఆ టీమ్‌పై ఉన్న తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ, సులువుగా గెలిచింది. 245 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా(Team India) 107 పరుగులతో గెలిచి వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. పూజా వస్త్రాకర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది. మొహాలీ టెస్ట్‌ను మూడు రోజుల్లోనే ముగించింది. బ్యాట్, బాల్‌తో ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్‌లు శ్రీలంకను ఓ ఆటాడుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 574 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. తొలుత 174 పరుగులు చేసి ఆలౌటైన లంక ఫాలోఆన్ లోనూ చేతులెత్తేసింది. 178 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్.. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అటు టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభమవుతాయని బీసీసీఐ వెల్లడించింది. ముంబై, పుణె నగరాల్లోని నాలుగు మైదానాల్లో దాదాపు 65 రోజులపాటు 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించింది బీసీసీఐ. ఐపీఎల్ -15వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఆరంభమవుతుందని తెలిపింది. ఒకే రోజు, ఈ మూడు జరగడంతో, క్రికెట్ లవర్స్ ఆనందానికి అవధుల్లేవు.
Also Read: Health Tips: అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?