Sachin Tendulkar : ఆగస్టు 14 ఇది చరిత్రలో నిలిచిన రోజు.. ఫస్ట్ సెంచరీతో క్రికెట్ చరిత్ర మార్చిన 17ఏళ్ల కుర్రాడు
సచిన్ టెండూల్కర్.. ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్, సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత తన మొదటి సెంచరీతో ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ నేటికీ రికార్డుల్లో ఉన్నాడు.

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. 16 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సచిన్, సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత తన మొదటి సెంచరీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 1990లో సరిగ్గా ఇదే రోజు, అంటే ఆగస్టు 14న సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఈ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక పోస్ట్ చేసింది. 1990లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో వన్డే, టెస్ట్ సిరీస్‌లు ఆడేందుకు పర్యటిస్తోంది. టెస్ట్ సిరీస్‌లో భారత్ మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో, రెండవ టెస్ట్‌ను గెలవాల్సిన లేదా డ్రా చేయాల్సిన ఒత్తిడిలో ఉంది. ఈ కీలక మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తన ప్రదర్శనతో తాను క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతానని నిరూపించాడు.
ఈ టెస్టులో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ గ్రాహం గూచ్ (333), మైక్ అథర్టన్ (131) సెంచరీలతో ఇంగ్లాండ్ 519 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌కు వచ్చి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 179 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. సచిన్ మొదటి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్లకు 320 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే భారత జట్టు చివరి రోజు వరకు వికెట్లు కోల్పోకుండా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో సచిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతని రాకముందు సంజయ్ మంజ్రేకర్ మాత్రమే అర్ధ సెంచరీ చేయగా, మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ఐదవ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేయాల్సిన బాధ్యత అంతా సచిన్‌పై పడింది. ఈ యువ ఆటగాడు ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రోజు భారత్ 6 వికెట్లకు 343 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఆ సెంచరీతో సచిన్ క్రికెట్ ప్రపంచానికి ఒక కొత్త తారగా పరిచయమయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కులలో సచిన్ ఒకడు. తన 17 సంవత్సరాల 107 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో అతని కంటే చిన్న వయసులో సెంచరీలు చేసిన వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ అష్రాఫుల్ (17 సంవత్సరాల 61 రోజులు), పాకిస్తాన్‌కు చెందిన ముస్తాక్ అహ్మద్ (17 సంవత్సరాల 78 రోజులు) ఉన్నారు. అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. అందుకే సచిన్‌ను ఈ రోజుకీ క్రికెట్ గాడ్‌గా అభిమానులు పిలుచుకుంటారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




