Vijay Mallya: ఆర్‌సీబీని కొన్నది క్రీడా స్ఫూర్తితో కాదు.. 18 ఏళ్ల తర్వాత అసలు విషయం చెప్పేసిన విజయ్ మాల్యా

Vijay Mallya Key Comments On Royal Challengers Bengaluru: ఆర్‌సీబీ 2025లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో, మాల్యా తన కలను నెరవేర్చుకున్నానని హర్షం వ్యక్తం చేశారు. గతంలో విరాట్ కోహ్లీతో సహా రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జాక్వెస్ కల్లిస్ వంటి గొప్ప ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నానని, ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరుకు తీసుకురావడమే తన లక్ష్యంగా జట్టును నిర్మించానని ఆయన చెప్పారు.

Vijay Mallya: ఆర్‌సీబీని కొన్నది క్రీడా స్ఫూర్తితో కాదు.. 18 ఏళ్ల తర్వాత అసలు విషయం చెప్పేసిన విజయ్ మాల్యా
Vijay Mallya Key Comments On Rcb

Updated on: Jun 06, 2025 | 4:31 PM

Vijay Mallya Key Comments On Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న వేళ, ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా సంచలన విషయాలు వెల్లడించారు. 2008లో RCB ఫ్రాంచైజీని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో, అప్పటి యువ ఆటగాడు విరాట్ కోహ్లీని జట్టులోకి ఎలా తీసుకున్నారో ఆయన తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో వివరించారు.

వ్యాపార ప్రమోషనే ప్రధాన లక్ష్యంగా..

తనకు క్రికెట్‌పై ఉన్న అమితమైన ఇష్టంతోనో, లేదా తన విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శించుకోవడానికో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేశానని చాలామంది అనుకుంటారని, కానీ అది నిజం కాదని మాల్యా స్పష్టం చేశారు. “నా ప్రాథమిక ఉద్దేశం వ్యాపారమే. రాయల్ ఛాలెంజ్, కింగ్‌ఫిషర్ వంటి నా బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికే ఆర్‌సీబీని కొన్నాను” అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు, లలిత్ మోడీ బీసీసీఐ కమిటీకి ఈ లీగ్ గురించి వివరించారని, అది తనను ఎంతగానో ఆకట్టుకుందని మాల్యా అన్నారు. “లలిత్ మోడీ ఒకరోజు నాకు ఫోన్ చేసి, టీమ్‌లను వేలం వేయబోతున్నారు, మీరు కొంటారా అని అడిగారు. నేను మూడు ఫ్రాంచైజీల కోసం బిడ్ చేశాను, ముంబైని చాలా తక్కువ తేడాతో కోల్పోయాను” అని ఆయన వివరించారు. చివరికి, బెంగళూరును కొనుగోలు చేయడానికి తాను 112 మిలియన్ డాలర్లు (2008 నాటి విలువ ప్రకారం దాదాపు 600-700 కోట్ల రూపాయలు) చెల్లించినట్లు మాల్యా చెప్పారు. ఇది ఐపీఎల్‌లో రెండో అత్యధిక బిడ్ అని, దీన్ని ఇప్పుడు చూస్తే అదొక అద్భుతమైన పెట్టుబడి అని అభివర్ణించారు.

ఆర్‌సీబీని ఒక ‘లైఫ్‌స్టైల్ బ్రాండ్’గా మార్చాలనే లక్ష్యంగా..

క్రికెట్ టీం కంటే RCBని ఒక లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా మార్చాలనే లక్ష్యం తనకు ఉండేదని మాల్యా వెల్లడించారు. మ్యాచ్‌ల తర్వాత పార్టీలు, చీర్ లీడర్‌లు, అభిమానులతో నిరంతరం సంబంధాలు వంటివి తన వ్యూహంలో భాగమేనని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్, రాయల్ ఛాలెంజ్ తన బ్రాండ్‌లు కాబట్టి, వాటిని ప్రచారం చేసుకోవడానికి ప్రతి మ్యాచ్‌ను ఒక ఈవెంట్‌గా మార్చాలని తాను కోరుకున్నట్లు మాల్యా పేర్కొన్నారు. “ప్రజలు దీన్ని ఆర్భాటంగా భావించవచ్చు, కానీ అది ఒక వ్యూహం. బెంగళూరు ప్రజలు దాన్ని ఇష్టపడ్డారు, ఆర్‌సీబీ ఆ నగరానికి హృదయ స్పందనగా మారింది” అని ఆయన అన్నారు.

విరాట్ కోహ్లీని గుర్తించింది మాల్యాయే..

యువకుడు విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం వెనుక కూడా మాల్యా ప్రమేయం ఉంది. అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో కోహ్లీని చూసి, అతని ప్రతిభకు తాను ఎంతగానో ముగ్ధుడినయ్యానని మాల్యా గుర్తు చేసుకున్నారు. “నేను అతన్ని ఎంపిక చేసుకున్నాను, 18 సంవత్సరాల తర్వాత కూడా అతను అక్కడే ఉండటం అద్భుతం. అప్పుడు అతను చిన్న పిల్లవాడు, కానీ ఎనర్జీతో, గొప్ప టాలెంట్‌తో ఉన్నాడు, ఇప్పుడు భారతదేశం చూసిన గొప్ప క్రికెటర్లలో ఒకడు” అని మాల్యా ప్రశంసించారు.

RCB 2025లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో, మాల్యా తన కలను నెరవేర్చుకున్నానని హర్షం వ్యక్తం చేశారు. గతంలో విరాట్ కోహ్లీతో సహా రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జాక్వెస్ కల్లిస్ వంటి గొప్ప ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నానని, ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరుకు తీసుకురావడమే తన లక్ష్యంగా జట్టును నిర్మించానని ఆయన చెప్పారు.

విజయ్ మాల్యా చేసిన ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో, ముఖ్యంగా ఐపీఎల్‌లో వ్యాపారం, క్రీడల మధ్య సంబంధం గురించి కొత్త చర్చకు తెరలేపాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..