Test Records : టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు.. రికార్డులు బద్ధలు కొట్టిన తోపు బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు (200+ పరుగులు) సాధించిన టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇది. ఇందులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ టాప్‌లో ఉండగా, భారత స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Test Records : టెస్ట్ క్రికెట్‌ను క్రికెట్ చరిత్రలో అత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన ఫార్మాట్‌గా భావిస్తారు. ఈ ఫార్మాట్‌లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ చేయడం అనేది వారి టెక్నిక్, సహనానికి నిదర్శనం. ఇది వారికి క్రికెట్ చరిత్రలో స్పెషల్ ప్లేస్ కల్పిస్తుంది. క్రికెట్లో ఇప్పటికే చాలా కొద్దిమంది బ్యాటర్లు ఈ ఘనతను సాధించారు.. కానీ కొందరు మాత్రమే దీనిని చాలా సార్లు చేసి చూపించారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో ఈ వార్తలో తెలుసుకుందాం.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాటర్లు
డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) – 12 డబుల్ సెంచరీలు
టెస్ట్ క్రికెట్‌కు రారాజుగా పేరుగాంచిన డాన్ బ్రాడ్‌మాన్, కేవలం 52 టెస్ట్ మ్యాచ్‌లలోనే 12 డబుల్ సెంచరీలు సాధించాడు. అతని కెరీర్ సగటు 99.94, ఇది ఇప్పటికీ ఒక అద్భుతమైన రికార్డు. అతను 80 ఇన్నింగ్స్‌లలో 6996 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 334.
కుమార్ సంగక్కర (శ్రీలంక) – 11 డబుల్ సెంచరీలు
శ్రీలంక మాజీ కెప్టెన్, టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ బ్యాటర్‌గా పేరున్న కుమార్ సంగక్కర, 134 టెస్ట్ మ్యాచ్‌లలో 11 డబుల్ సెంచరీలు సాధించాడు. అతను 233 ఇన్నింగ్స్‌లలో 12400 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 319 కాగా, సగటు 57.40.
బ్రియన్ లారా (వెస్టిండీస్) – 9 డబుల్ సెంచరీలు
క్రికెట్ చరిత్రలోని అత్యంత స్టైలిష్ బ్యాటర్లలో ఒకరైన బ్రియన్ లారా కూడా డబుల్ సెంచరీలలో తన సత్తా చాటాడు. అతను 131 టెస్ట్ మ్యాచ్‌లలో 9 డబుల్ సెంచరీలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన అజేయంగా 400 పరుగులు చేయడం అతని కెరీర్ హైలైట్.
వాలీ హమ్మండ్ (ఇంగ్లాండ్) – 7 డబుల్ సెంచరీలు
ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ వాలీ హమ్మండ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 85 టెస్ట్ మ్యాచ్‌లలో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. తన కెరీర్‌లోని 140 ఇన్నింగ్స్‌లలో 7249 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు అజేయంగా 336 పరుగులు.
విరాట్ కోహ్లీ (భారత్) – 7 డబుల్ సెంచరీలు
ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అతను తన 123 టెస్ట్ మ్యాచ్‌లలో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ తన కెరీర్‌లోని 210 ఇన్నింగ్స్‌లలో 9230 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు అజేయంగా 254 పరుగులు కాగా, అతని సగటు 46.85.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




