AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup: మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిసిన తెలంగాణ అమ్మాయి.. హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ సిక్స్‌కు టీమిండియా

తెలంగాణకు చెందిన యువ క్రికెటర్‌ గొంగడి త్రిష(51 బంతుల్లో 57, 6ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్‌(33) రాణించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిష జట్టుకు మెరుగైన శుభారంభాన్ని ఇచ్చింది.

U19 World Cup: మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిసిన తెలంగాణ అమ్మాయి.. హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ సిక్స్‌కు టీమిండియా
Indian Women's Cricket Team
Basha Shek
|

Updated on: Jan 19, 2023 | 6:15 AM

Share

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. మహిళల విభాగంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో కప్‌ సాధించడమే లక్ష్యంగా టీమిండియా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, యూఏఈలను మట్టికరిపించిన బుధవారం స్కాట్లాండ్‌ను కూడా చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 149/4 స్కోరు చేసింది. తెలంగాణకు చెందిన యువ క్రికెటర్‌ గొంగడి త్రిష(51 బంతుల్లో 57, 6ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్‌(33) రాణించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిష జట్టుకు మెరుగైన శుభారంభాన్ని ఇచ్చింది. స్టార్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ త్వరగా ఔటైనా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. సహచరులు వరుసగా పెవిలియన్‌ చేరుతున్నా స్కాట్లాండ్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన శ్వేత కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది.

స్వల్ప స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ మెరుగ్గానే ఆడింది. పవర్‌ ప్లే ముగిసే సరికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 45 పరుగులు చేసి గెలుపు బాటలో పయనించింది. అయితే ఇక్కడి నుంచి భారత్‌ స్పిన్ త్రయం అద్భుతాలు చేసింది. మన్నత్ కశ్యప్, అర్చన దేవి సింగ్, సోనమ్ యాదవ్ గింగిరాలు తిరిగే బంతులతో స్కాట్లాండ్‌ అమ్మాయిలకు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మన్నత్ నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, ఆఫ్ స్పిన్నర్ అర్చన దేవి 14 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. దీంతో కేవలం 21 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు కేవలం 10 ఓవర్లలోనే 66 పరుగులకే కుప్పుకూలింది. డార్సీ కార్టర్‌(24) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కాగా మూడు మ్యాచుల్లో మూడు విజయాలతో టీమిండియా గ్రూపు-డిలో ఆరు పాయింట్లతో సూపర్ టాప్‌లో కొనసాగుతోంది. దీంతో సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించినట్లైంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా(4), యూఏఈ(2) ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..