IND vs SL 1st ODI : శిఖర్ సేన లక్ష్యం 263 పరుగులు.. రాణించిన యువ బౌలర్లు.. చివర్లో చెలరేగిన కరుణరత్నె
IND vs SL 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదటి వన్డే జరగుతున్న సంగతి తెలిసిందే.
IND vs SL 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదటి వన్డే జరగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. దీంతో శిఖర్ సేనకు 263 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో కరుణరత్నె(43 నాటౌట్) ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు. అతడికి చమీరా (13) చక్కటి సహకారం అందించాడు.
అంతకుముందు కెప్టెన్ దాసున్ షనక (39; 50 బంతుల్లో 2×4, 1×6), అసలంక (38; 65 బంతుల్లో 1×4) నిలకడగా ఆడారు. మరోవైపు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2×4, 1×6), మినోద్ భానుక (27; 44 బంతుల్లో 3×4) సైతం శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. చాహల్ బౌలింగ్‌లో ఫెర్నాండో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆపై కుల్‌దీప్ వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ భానుక రాజపక్స (24; 22 బంతుల్లో 2×4, 2×6), మరో ఓపెనర్ మినోద్ భానుకను ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపాడు. తర్వాత ధనుంజయ డి సిల్వను(14) కృనాల్ పాండ్య బోల్తా కొట్టించాడు. చివర్లో భారత బౌలర్లు పట్టు కోల్పోవడంతో కరుణరత్నె చెలరేగిపోయాడు. దాంతో టీమ్‌ఇండియా లక్ష్యం 263 పరుగులుగా నమోదైంది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు తీయగా కృనాల్, హార్దిక్ చెరో వికెట్ తీశారు.