
Surya Kumar Yadav: రాబోయే టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2026లో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్, “ఫైనల్లో ఏ జట్టుతో తలపడాలని అనుకుంటున్నారు?” అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించాలనుందని తెలిపాడు.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమికి ప్రతీకారంగానే సూర్యకుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఆనాడు చేజారిన కప్పును, అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి సాధించాలన్న కసిని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.
తేదీలు: ఈ టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.
వేదికలు: భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండీలలో జరుగుతాయి.
ఆతిథ్య భారత్, శ్రీలంకతో పాటు, టోర్నమెంట్‌లో పాల్గొనే 18 జట్లు ఆఫ్ఘనిస్తాన్ , ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఓమన్, యూఏఈ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడుతుంది.
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారీ సమరం జరగనుంది.
ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.
ఈసారి సొంతగడ్డపై జరుగుతుండటం, గత టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు టైటిల్ నిలబెట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.