పక్కన పెట్టలేరు.. పరుగులు రాబట్టలేరు.. టీమిండియాకు ‘భారం’గా ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు..!
Team India: ప్రధానంగా జట్టును నడిపించాల్సిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లే ఇప్పుడు జట్టుకు భారంగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పరుగులు చేయడం లేదు. అలాగని వారిని జట్టు నుంచి తొలగించే పరిస్థితి కూడా లేదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది టీమిండియా పరిస్థితి.

Team India: దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ 101 పరుగుల భారీ విజయం సాధించినప్పటికీ, జట్టులో కొన్ని ఆందోళనకరమైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా జట్టును నడిపించాల్సిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లే ఇప్పుడు జట్టుకు భారంగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పరుగులు చేయడం లేదు. అలాగని వారిని జట్టు నుంచి తొలగించే పరిస్థితి కూడా లేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కాదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.
1. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్: ఫామ్ కోల్పోయిన ‘స్కై’: ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్, 2025లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 2025లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన సూర్య, 16 ఇన్నింగ్స్‌లలో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 15.07 కాగా, స్ట్రైక్ రేట్ 126.45 మాత్రమే.
భారం ఎందుకంటే?: ఈ ఏడాది ఒక్క హాఫ్ సెంచరీ (50) కూడా చేయలేకపోయాడు. బ్యాటర్‌గా విఫలమవుతున్నా, అతను టీ20 జట్టుకు కెప్టెన్ కావడం వల్ల అతన్ని పక్కన పెట్టలేని పరిస్థితి. అతని నాయకత్వంలో జట్టు విజయాలు సాధిస్తుండటంతో, అతని వ్యక్తిగత వైఫల్యం మరుగున పడిపోతోంది.
2. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్: అవకాశాలొస్తున్నా.. మరోవైపు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ఏడాది టీ20లలో 13 మ్యాచ్‌లు ఆడిన గిల్, 26.30 సగటుతో 263 పరుగులు మాత్రమే చేశాడు. 13 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ గిల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఫామ్ లేకపోయినా అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించారు.
గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తూ, మరోవైపు సెంచరీలు చేసిన సంజు శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం లేదా స్థానాలు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. గిల్ కోసం సంజును బలి చేస్తున్నారనే వాదన కూడా ఉంది.
మొత్తానికి భారత టీ20 జట్టు విజయాల బాటలో ఉన్నా, కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్‌ల వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. వీరిద్దరూ త్వరగా ఫామ్‌లోకి రాకపోతే, రాబోయే పెద్ద టోర్నీలలో భారత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




