T20 Cricket: తెలుగోడి దెబ్బకు టీ20 రికార్డులు బద్దలు.. వరుసగా 3వ సెంచరీతో సరికొత్త చరిత్ర
Tilak Varma: తిలక్ వర్మ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా 2 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇందుతో అతను వరుసగా 107, 120 పరుగులతో ఆకట్టుకున్నాడు. వరుసగా రెండు T20 సెంచరీలు సాధించిన భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తిలక్ అదే శైలిని కొనసాగించాడు.
Tilak Varma: ప్రస్తుతం భారత బ్యాట్స్‌మెన్‌లు టెస్టు క్రికెట్‌లో బిజీగా ఉన్నారు. బంగ్లాదేశ్‌పై కూడా బ్యాట్స్‌మెన్ ఫర్వాలేదనిపించగా, ఆ తర్వాత న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా బ్యాటింగ్ పూర్తిగా పరాజయం పాలైంది. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్‌లో కూడా టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే, ఆ తర్వాత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే, భారత యువ బ్యాట్స్‌మెన్స్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇబ్బందికరంగా కనిపించారు. కానీ పొట్టి ఫార్మాట్‌లో మాత్రం రాణిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ తన ప్రతిభను చాటుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తిలక్ ఇప్పుడు వరుసగా మూడో టీ20 సెంచరీని సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే తిలక్ రికార్డు బద్దలు కొట్టాడు. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
వరుసగా మూడో సెంచరీతో సరికొత్త చరిత్ర..
కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో తిలక్ వర్మ వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో భారతదేశంలో అతి పిన్న వయస్కుడిగా, రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తిలక్ ఇప్పుడు దేశవాళీ టీ20 టోర్నీలోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్.. టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో మేఘాలయపై కేవలం 67 బంతుల్లో 151 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు.
నవంబర్ 23వ తేదీ శనివారం ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు సాధించాడు. దీనికి కారణం కెప్టెన్ తిలక్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తన దక్షిణాఫ్రికా ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్‌లతో 151 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా 3 సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా తిలక్ నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాలో, అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 107 (నాటౌట్), 120 (నాటౌట్) ఇన్నింగ్స్‌లు ఆడాడు.
అత్యధిక స్కోరు సాధించిన భారతీయుడిగా రికార్డ్..
ఇది కాకుండా తిలక్ వర్మ మరికొన్ని రికార్డులు కూడా సృష్టించాడు. అతని 151 పరుగులు ఈ టోర్నీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్‌గా కొత్త రికార్డుగా నమోదయ్యాయి. ఈ విషయంలో, 2019లో 147 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ రికార్డును తిలక్ బద్దలు కొట్టాడు. అంతే కాదు టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా ఏ బ్యాట్స్‌మెన్ సాధించిన మూడో అత్యధిక స్కోరైనా ఇదే కావడం గమనార్హం. ఈ విషయంలో ఆరోన్ ఫించ్ (172), గ్లెన్ మాక్స్ వెల్ (154 నాటౌట్) మాత్రమే అతని కంటే ముందున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..