Asia Cup 2022: ఆ ఒక్క షాట్ ఎంత పని చేసిందో.. శ్రీలంకతో కీలక మ్యాచ్ నుంచి యంగ్ ప్లేయర్ ఔట్.. ఎవరంటే?
IND vs SL: ఆసియా కప్‌లో శ్రీలంకతో భారత్ నేడు డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రోహిత్ సేనకు చాలా కీలకంగా మారింది.

Rishabh Pant: ఆసియా కప్‌లో మంగళవారం శ్రీలంకతో భారత్ పోటీపడనుంది. టోర్నీలో భారత్ నిలవాలంటే ప్రస్తుం డూ ఆర్ డై అనే పరిస్థితి నెలకొంది. ముఖ్యమైన మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని దినేష్ కార్తీక్‌కు టీమిండియాలో అవకాశం కల్పించవచ్చు. గత మ్యాచ్‌లో కార్తీక్‌కు బదులుగా రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్ లో రిషబ్ ఎంచుకున్న షాట్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కీలక మ్యాచ్ నుంచి దూరమయ్యేలా కనిపిస్తోంది. రిషబ్ పంత్ షాట్ ఎంపికను మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి ప్రశ్నించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో పంత్ కీలక సమయంలో త్వరగానే ఔటయ్యాడు. పంత్ తన 12 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి 14 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ వేసిన ఓ బంతిని నేరుగా బ్యాక్‌వర్డ్ పాయింట్‌కి రివర్స్ స్వీప్ చేశాడు.
పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చిన వెంటనే, రోహిత్ తన షాట్‌కు కారణాన్ని అడగడం కనిపించింది. పంత్ ఆ షాట్ ఆడటానికి గల కారణాన్ని భారత కెప్టెన్‌కి చెప్పడం కూడా కనిపించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వీడియోలో రోహిత్ చాలా కోపంగా కనిపించాడు.
పంత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి..




మ్యాచ్ ముగిసిన తర్వాత, పంత్‌ను ఔట్ చేసిన తీరుపై స్టార్ స్పోర్ట్స్‌లో గంభీర్ నిరాశ వ్యక్తం చేశాడు. “రిషబ్ పంత్ నిరాశ చెందుతాడు. ఎందుకంటే అది అతని షాట్ కాదు. అతని షాట్ బహుశా లాంగ్-ఆన్ లేదా డీప్ మిడ్-వికెట్ కావచ్చు. తప్పు షాట్ ఎంచుకుంటే కచ్చితంగా ఔట్ అవుతారు. ఎందుకంటే మీ బలం రివర్స్ స్వీపింగ్ కాదు” అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.
అక్రమ్ కూడా గంభీర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు కనిపించాడు. ముఖ్యంగా, ఆట కీలక దశలో, ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదని గంభీర్‌తో తెలిపాడు. టెస్టు క్రికెట్‌లో అతను ఆ షాట్ ఆడతాడని నాకు తెలుసు. అతను ప్రపంచ క్రికెట్‌లోని టాప్ ప్లేయర్‌లలో ఒకడని నాకు తెలుసు. కానీ, ఈ దశలో ఆ షాట్ అవసరం లేదంటూ తేల్చి చెప్పాడు.
టీ20 ఇంటర్నేషనల్‌లో రిషబ్ పంత్ ఇప్పటివరకు 50కి పైగా మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పంత్‌కు బదులుగా కార్తీక్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి కార్తీక్ జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.




