Manish Pandey – Ashrita Shetty Divorce Rumours: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ధన్‌శ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ జోడీ కూడా ఈ బాటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు టీమిండియా ప్లేయర్ మనీష్ పాండే. అవును, మనీష్ పాండే, అతని భార్య అశ్రిత శెట్టి మధ్య విభేదాలు వచ్చాయంట. ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రూమర్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం ఉంది. ఈ స్టార్ జోడీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇది కాకుండా, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా వారి ఖాతాల నుంచి తొలగించారు. అందుకే వీరిద్దరి రిలేషన్ షిప్‌లో చీలిక వచ్చిందని అంటున్నారు. అయితే, దీనిపై వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి రానున్న రోజుల్లో ప్రస్తుత రూమర్లకు ఈ స్టార్ జంట ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో వేచి చూడాలి.
మనీష్ పాండే, అశ్రిత శెట్టి 2019 లో వివాహం చేసుకున్నారు. కర్నాటకకు చెందిన అశ్రిత తమిళ సినిమాల్లో కూడా పనిచేసింది. పెళ్లయిన తర్వాత చాలాసార్లు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన భర్తకు మద్దతుగా మైదానానికి వచ్చింది. కానీ, ఐపీఎల్ 2024లో అతను స్టేడియంలో కనిపించలేదు. మనీష్ పాండే ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. అంతేకాదు అతని జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత కూడా అశ్రిత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు.
మనీష్ పాండే కెరీర్ గురించి మాట్లాడితే.. 2015లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మనీష్ జట్టులో శాశ్వత స్థానం పొందలేకపోయాడు. అలా అతని అంతర్జాతీయ కెరీర్ తక్కువ కాలంలోనే ముగిసింది. మనీష్ భారత్ తరపున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20ల్లో 709 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మనీష్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ కోసం జట్టు నుంచి తొలగించారు.