T20 Cricket: 33 ఫోర్లు, 36 సిక్సర్లతో ఏకంగా 501 పరుగులు.. టీ20ల్లో వరల్డ్ రికార్డు..

పొట్టి ఫార్మాట్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల హోరు. బ్యాట్స్‌మెన్లు మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపించే టీ20 క్రికెట్‌లో..

T20 Cricket: 33 ఫోర్లు, 36 సిక్సర్లతో ఏకంగా 501 పరుగులు.. టీ20ల్లో వరల్డ్ రికార్డు..
Csa T20 Challenge

Updated on: Nov 03, 2022 | 6:15 PM

పొట్టి ఫార్మాట్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల హోరు. బ్యాట్స్‌మెన్లు మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపించే టీ20 క్రికెట్‌లో తాజాగా అత్యంత అరుదైన ఘనత నమోదైంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ లీగ్‌ ప్రపంచ రికార్డుకు వేదికైంది. ఇటీవల టైటాన్స్, నైట్స్ జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి.

టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు రెచ్చిపోయారు. 33 ఫోర్లు, 36 సిక్సర్లతో ఓవరాల్‌గా 501 పరుగులు సాధించారు. దీంతో గతంలో టీ20 ఫార్మాట్‌లో ఉన్న అత్యధిక స్కోర్(రెండు జట్లది కలిపి) 497 పరుగుల రికార్డును బ్రేక్ చేశారు. 2016లో సూపర్‌ స్మాష్‌ లీగ్‌లో భాగంగా సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 497 పరుగులు నమోదైన విషయం విదితమే. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. 2016లో భారత్-వెస్టిండిస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 489 పరుగులు నమోదయ్యాయి.

కాగా, నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ బ్యాటర్ డెవాల్డ్‌ బ్రెవిస్‌(162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇక కొండంత లక్ష్యచేదనలో భాగంగా నైట్స్ జట్టు నిర్ణీత ఓవర్లకు 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టైటాన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.