T20 World Cup: పసికూన చేతిలో పరాజయం.. తట్టుకోలేక బోరున ఏడ్చిన పాక్‌ వైస్‌ కెప్టెన్‌.. ఎమోషనల్‌ వీడియో

|

Oct 29, 2022 | 10:33 AM

పాకిస్థాన్ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అయితే జింబాబ్వే చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్‌ అనంతరం కింద కూర్చోని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బోరున ఏడ్చాడు. పాక్‌ జట్టులోని సహాయక సిబ్బంది ఒకరు షాదాబ్‌ దగ్గరకు వచ్చి అతనిని ఓదార్చారు

T20 World Cup: పసికూన చేతిలో పరాజయం.. తట్టుకోలేక బోరున ఏడ్చిన పాక్‌ వైస్‌ కెప్టెన్‌.. ఎమోషనల్‌ వీడియో
Shadab Khan
Follow us on

క్రికెట్‌లో గెలుపు, ఓటములు సహజం. ఇవాళ ఓడిన జట్టు రేపు గెలుపొందడం ఖాయం. ఆటను ఆటలాగే చూడాలి.. ఇలాంటివి మాట్లాడడం చాలా సులభమే. కానీ అనుభవించే వారికే అసలు బాధ తెలుస్తుంది. ప్రస్తుతం పాక్ క్రికెటర్లు, అభిమానుల పరిస్థితి కూడా అదే. T20 ప్రపంచ కప్‌లో భాగంగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది పాకిస్తాన్‌. మరీ ముఖ్యంగా ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం పాక్‌ ఆటగాళ్లు, అభిమానులను బాగా కలిచివేస్తోంది. కాగా పాక ఓటమితో కెప్టెన్‌ బాబర్‌ పూర్తి నిర్వేదంలో మునిగిపోవడం, కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక పాకిస్థాన్ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అయితే జింబాబ్వే చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్‌ అనంతరం కింద కూర్చోని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బోరున ఏడ్చాడు. పాక్‌ జట్టులోని సహాయక సిబ్బంది ఒకరు షాదాబ్‌ దగ్గరకు వచ్చి అతనిని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. బాధను మర్చిపోయి తర్వాత మ్యాచ్‌పై దృష్టి సారించాలంటూ ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు.

విమర్శల పర్వం..

ఇక ఇదే మ్యాచ్‌లో మహ్మద్ నవాజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 20వ ఓవర్ ఐదో బంతికి నవాజ్ అవుటైన వెంటనే పిచ్‌పై కూలబడిపోయాడు. కాగా 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక పరుగు తేడాతో పాక్‌ పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టుపై మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ కష్టాల్లో కూరుకుపోయిందని ఆ దేశ క్రికెట్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు షోయబ్ అక్తర్. మంచి ఆటగాళ్లను పక్కన పెట్టి, పేలవమైన ఫామ్‌తో ఉన్న ప్లేయర్లను జట్టులో చేర్చుకోవడం వల్లే పాక్ జట్టుకు ఇలా జరిగిందని జావేద్ మియాందాద్ మండిపడ్డాడు.

ఇవి కూడా చదవండి

130 రన్స్‌ చేయలేరా?

మాజీ ఓపెనర్ మొహ్సిన్ ఖాన్, ‘ఇది మన క్రికెట్‌నా? జింబాబ్వే వంటి బలహీన జట్టుపై 130 పరుగులు చేయలేకపోయాం అంటూ విమర్శించాడు. సల్మాన్ బట్ కూడా జట్టును విమర్శించాడు. బాబర్-రిజ్వాన్ బాగా ఆడకపోతే జట్టు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇక పాక్‌ తన తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఆదివారం పెర్త్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..