ఖాతా ఓపెన్ చేయకుండానే టోర్నీ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లలో ప్రైజ్ మనీ
ICC Prize Money for Eliminated Teams: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. గ్రూప్ స్టేజ్ ముగిసే సరికి దాదాపు 12 జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. మొత్తంగా 3 జట్లు ఒక్క విజయం లేకుండా ఈ మెగా టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగాయి.

ICC Prize Money for Eliminated Teams: టీ20 వరల్డ్ కప్ 2026లో కొన్ని జట్లకు ఈ టోర్నీ పూర్తిగా నిరాశను మిగిల్చింది. మొత్తం 20 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ పూర్తయ్యేసరికి 12 జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వీటిలో మూడు జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఈ జట్లు, విజయం నమోదు చేయకపోయినా ఖాళీ చేతులతో మాత్రం ఇంటికి వెళ్లడం లేదు. ఐసీసీ నుంచి ఈ జట్లకు భారీ ప్రైజ్ మనీ అందనుంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..
ఈ జట్లకు ఒక్క విజయం కూడా దక్కలేదు..
టీ20 వరల్డ్ కప్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని జట్లు ఒమాన్, నమీబియా, కెనడా.
గ్రూప్-ఏలో ఉన్న నమీబియా భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికా చేతిలో ఓటమి పాలైంది.
కెనడా జట్టు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్, అమెరికా జట్లతో ఓడిపోయింది.
అలాగే ఒమాన్ జట్టు జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైంది.
ఈ మూడు జట్లు తప్ప మిగతా అన్ని జట్లు కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి ఖాతా తెరిచాయి.
మ్యాచ్ గెలవకపోయినా కోట్ల రూపాయల బహుమతి..
ఈ జట్లకు విజయం దక్కకపోయినా, ఐసీసీ నిబంధనల ప్రకారం వీటికి ప్రైజ్ మనీ ఖాయం. గత ఎడిషన్‌లో 9వ నుంచి 12వ స్థానాల్లో నిలిచిన ప్రతి జట్టుకు 247,500 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.25 కోట్లు) అందించారు. అలాగే 13వ నుంచి 20వ స్థానాల్లో ఉన్న ప్రతి జట్టుకు 225,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 2 కోట్లు) ఇచ్చారు. అదే విధంగా ఈసారి కూడా ఒమాన్, నమీబియా, కెనడా జట్లకు కనీసం రూ. 2 కోట్లకు పైగా ప్రైజ్ మనీ లభించే అవకాశాలు ఉన్నాయి.
ఈ మూడు జట్లు అసోసియేట్ నేషన్స్ కావడంతో, ఇలాంటి పెద్ద టోర్నీల్లో పాల్గొనడం ద్వారా విలువైన అనుభవం సంపాదిస్తాయి. ఐసీసీ నుంచి లభించే ఈ బహుమతి వారి క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్ టోర్నీలకు సిద్ధం కావడం, యువ ఆటగాళ్ల అభివృద్ధి, క్రికెట్ మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
