T20 World Cup: సెమీస్‌లో అలా జరిగితే.. టీమిండియాతో పాటు ఫైనల్ చేరే జట్టు అదే.. ఎలాగంటే?
తొలి ఫైట్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్ పోటీ పడనుండగా.. రెండో ఫైట్ నవంబర్ 10న భారత్-ఇంగ్లాండ్ అడిలైడ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
టీ20 వరల్డ్‌కప్ 2022 చివరి అంకానికి చేరుకుంది. సెమీఫైనల్స్ పోరుకు రంగం సిద్దమైంది. నవంబర్ 9వ తేదీన సిడ్నీ వేదికగా తొలి ఫైట్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్ పోటీ పడనుండగా.. రెండో ఫైట్ నవంబర్ 10న భారత్-ఇంగ్లాండ్ అడిలైడ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం ముప్పు లేనట్లేనని సమాచారం. అయితే ఒకవేళ అకస్మాత్తుగా వర్షం వచ్చి మ్యాచ్‌లు రద్దైతే, రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే.. అప్పుడు పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
దానికి సమాధానం లేకపోలేదు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు కూడా ఓ రిజర్వ్ డే ఉంది. జరగాల్సిన రోజున వర్షం వచ్చి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే.. ఆగిపోయిన దగ్గర నుంచి ఆటను మరుసటి రోజున కొనసాగిస్తారు. అయితే రిజర్వ్ డే రోజు కూడా వర్షం వచ్చి ఆట సాధ్యం కాకపోతే సెమీఫైనల్స్‌లో టేబుల్ టాపర్లుగా ఉన్న న్యూజిలాండ్, భారత్ ఫైనల్‌కు చేరుతాయి. ఇక ఇంగ్లాండ్, పాకిస్తాన్ ఇంటికి వెళ్ళాల్సిందే. కాగా, ఫైనల్ విషయానికొస్తే.. షెడ్యులైన రోజు, డిసైడర్ డే వర్షం వచ్చి ఆట సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.