T20 World Cup: ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ఆ స్టార్ ప్లేయర్.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ కూడా.?
T20 World Cup: అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ షూరూ కానుంది. ఇందుకోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది...
అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ షూరూ కానుంది. ఇందుకోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 జట్టులో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే ఆఫ్ స్పిన్నర్ చాహాల్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. ఎంపికైన భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెంటార్‌గా వ్యవరించనున్నాడు. ఇక పెద్ద సంచలనం ఏంటంటే.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు జట్టులో చోటు లేకపోవడమే అని చెప్పొచ్చు. దాదాపు దశాబ్దం పాటు భారత జట్టులో భాగమైన శిఖర్ ధావన్.. వన్డేలు, టీ20లలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ దిగాడు. అయితే ఇప్పుడు అతడు లేకపోవడంతో.. అతని స్థానాన్ని కెఎల్ రాహుల్ లేదా యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ భర్తీ చేయనున్నాడు. అయితే దాదాపుగా కెఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి.
శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ముందు, కెప్టెన్ కోహ్లీ రాహుల్, రోహిత్ ఓపెనింగ్ చేస్తారని.. ధావన్ మూడవ ఓపెనర్‌గా బాధ్యతను స్వీకరిస్తాడని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాదు, సిరీస్ ముగిశాక కెప్టెన్ కోహ్లీ స్వయంగా.. తానే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తానని చెప్పిన విషయం విదితమే.
ధావన్ ఫామ్‌లో సమస్య…
ఇటీవల కాలంలో ధావన్ అంతర్జాతీయ టీ20ల్లో ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. డిసెంబర్ 2020 నుండి, ధావన్ ఆస్ట్రేలియాతో 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతడు రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు, మిగిలిన మ్యాచ్‌లలో 40కి పైగా పరుగులు చేశాడు. అతడు అర్ధ సెంచరీలు సాధించిన మ్యాచ్‌లలో మెరుగైన స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచ్‌లలో వేగంగా పరుగులు చేయలేకపోయాడు. అయితే, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ధావన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
భారత్ టీం:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్
రిజర్వ్ ప్లేయర్స్:
శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ మరియు శార్దూల్ ఠాకూర్