
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలైపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం భారత్ తన 15 మంది సభ్యుల తుది జట్టును నేడు ప్రకటించనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరెవరు జట్టులో ఉన్నారో తేల్చేయనున్నారు. నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు ఆల్ రౌండర్లు, ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఈ సెలక్షన్లో ప్రధానంగా ఐదు అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
టీ20 ప్రపంచకప్ 2026 వేట మొదలైంది! ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న ఈ మహా సంగ్రామం కోసం భారత్ తన 15 మంది వీరులను నేడు (డిసెంబర్ 20) ప్రకటించనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలు వెల్లడిస్తారు. అయితే ఈ ప్రకటనకు ముందు సెలెక్టర్ల మెదడును తొలిచేస్తున్న ఆ ఐదు ప్రధాన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం:
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం క్లిష్ట సమయంలో ఉన్నాడు. గడిచిన ఏడాది కాలంగా సూర్య బ్యాట్ ఆశించిన స్థాయిలో మెరవడం లేదు. కానీ జట్టుకు నాయకుడు కావడం వల్ల అతను జట్టులో కొనసాగుతున్నాడు. 35 ఏళ్ల సూర్యకు కెప్టెన్‌గా ఇదే చివరి మేజర్ టోర్నీ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సెలెక్టర్లు సూర్య ప్రస్తుత ఫామ్‌ను చూసి టెన్షన్ పడతారా? లేక అతని అనుభవం మీద నమ్మకంతో ముందుకెళ్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఓపెనింగ్ చిక్కుముడి
శుభ్‌మన్ గిల్ ఆడే శైలి టీ20లకు సరిపోతుందా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. గత 18 ఇన్నింగ్స్‌లలో గిల్ స్ట్రైక్ రేట్, సగటు అంత ఆశాజనకంగా లేదు. గిల్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎక్కువ బంతులు వృధా చేస్తున్నాడనే విమర్శ ఉంది. మరోవైపు యశస్వి జైస్వాల్ తొలి బంతి నుంచే విరుచుకుపడతాడు. అయితే గిల్‌ను వైస్ కెప్టెన్ చేయాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉంటే, జైస్వాల్‌ను కేవలం స్టాండ్‌బై ప్లేయర్‌గా పరిమితం చేసే ప్రమాదం ఉంది.
సంజూ శామ్సన్.. ఓపెనరా లేక వికెట్ కీపరా?
కేరళ స్టార్ సంజూ శామ్సన్ పరిస్థితి ఉంటే ఊరు.. లేకపోతే అడవి అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం జట్టులో జితేష్ శర్మ మెయిన్ వికెట్ కీపర్‌గా రేసులో ఉన్నాడు. గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా స్థిరపడితే సంజూ శామ్సన్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఉంచుతారా? లేక మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా సంజూను తుది జట్టులో చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఫినిషర్ కావాలా? ఆల్ రౌండర్ కావాలా?
టీమ్ ఇండియాకు నమ్మదగ్గ ఫినిషర్ రింకు సింగ్. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిలాసఫీ కొంచెం భిన్నంగా ఉంది. జట్టులో ఎంత ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉంటే అంత బలమని గంభీర్ నమ్ముతాడు. అందుకే బ్యాటింగ్ చేయగల వాషింగ్టన్ సుందర్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది. రికార్డుల పరంగా రింకు సింగ్ టాప్‌లో ఉన్నా, బౌలింగ్ ఆప్షన్ కోసం వాషింగ్టన్‌ను తీసుకుంటే రింకుకు మొండిచేయి తప్పకపోవచ్చు.
4-2-4-5 ఫార్ములా వర్కవుట్ అవుతుందా?
సెలెక్టర్లు ఈసారి 4-2-4-5 ఫార్ములాను అనుసరించబోతున్నారని సమాచారం. అంటే నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు కీపర్లు, నలుగురు ఆల్ రౌండర్లు మరియు ఐదుగురు బౌలర్లు. ఈ కాంబినేషన్‌లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్ల పాత్ర కీలకం కానుంది. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి కాబట్టి స్పిన్నర్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.
భారత సంభావ్య జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శామ్సన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..