
Sunil Gavaskar Comments on Indian Cricketers Injuries: టీమిండియా స్టార్ ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దీని వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తూ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జిమ్ ఫిట్‌నెస్ కంటే మ్యాచ్ ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యమంటూ ప్రస్తుత శిక్షణా విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు.
భారత జట్టును గత కొంతకాలంగా వరుస గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్, హర్షిత్ రానా లాంటి కీలక ఆటగాళ్లు పదే పదే జట్టుకు దూరమవుతున్నారు. కోలుకున్నట్టే కోలుకుని మైదానంలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే మళ్లీ ఆసుపత్రి పాలవుతున్నారు. రాబోయే 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సన్నాహకాలతో పాటు అదే ఏడాది జరగాల్సిన ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ ప్రణాళికలపై ఈ గాయాల బెడద తీవ్ర ప్రభావం చూపుతోంది. తరచుగా ప్లేయర్లు దూరం కావడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై స్పందించిన సన్నీ.. ప్రస్తుత ఆటగాళ్ల సన్నద్ధతపై సూటి ప్రశ్నలు సంధించాడు.
ఆటగాళ్లు గాయపడిన ప్రతిసారీ బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గతంలో ఎన్సీఏ) పైనో, అక్కడి ఫిజియోల పైనో నెపం నెట్టేయడం పరిపాటిగా మారింది. ఈ వాదనను గవాస్కర్ గట్టిగా తప్పుబట్టాడు. జాతీయ జట్టు తరఫున ఆడుతున్న సమయంలోనే ఎక్కువ మంది క్రికెటర్లు గాయాల పాలవుతున్నారని ఆయన గుర్తుచేశాడు. బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతుంటే, చాలా మంది భారత ఆటగాళ్లు తరచూ స్నాయువు (హామ్ స్ట్రింగ్) గాయాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తే బ్లేమ్ చేయాల్సింది ఫిజియోలను కాదని స్పష్టమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఆటగాళ్లు అనుసరిస్తున్న శిక్షణా విధానంలో ఉన్న తీవ్రమైన లోపాలే అని ఆయన కుండబద్దలు కొట్టాడు.
బౌలర్ల ప్రాక్టీస్ విధానంపై గవాస్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. బయోమెకానిక్స్ పేరుతో బౌలర్లను నెట్స్‌లో పరిమిత బంతులు మాత్రమే వేయనివ్వడాన్ని ఆయన ప్రశ్నించాడు. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో విదేశీ ఫిజియోలు బౌలర్లను నెట్స్‌లో కేవలం 20 బంతులు మాత్రమే వేసేలా కఠిన నిబంధనలు పెడుతున్నారు. తీరా అసలు మ్యాచ్‌కి వచ్చేసరికి వారు కనీసం 24 బంతులు (నాలుగు ఓవర్లు, వైడ్లు, నోబాల్స్ కాకుండా) వేయాల్సి వస్తుంది. ప్రాక్టీస్‌లో తక్కువ బంతులు వేసి, అసలు మ్యాచ్‌లో ఎక్కువ బంతులు వేస్తే శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని ఆయన విశ్లేషించాడు. మైదానంలో వంద శాతం కష్టపడాలంటే ప్రాక్టీస్ సెషన్లు కూడా అదే స్థాయిలో సాగాలని ఆయన సూచించాడు.
ప్రస్తుత తరం క్రికెటర్లు గ్రౌండ్ ఫిట్‌నెస్ కంటే జిమ్ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. సిక్స్ ప్యాక్ దేహాలు, జిమ్‌లో బరువైన వ్యాయామాలు చేయడం వల్ల క్రికెట్‌కు కావాల్సిన సరైన స్టామినా రాదని పరోక్షంగా చురకలంటించాడు. జిమ్‌లో కండలు పెంచడం కంటే మైదానంలో మ్యాచ్ ఆడేందుకు తగ్గ ఫిట్‌నెస్ సాధించడం ఎంతో అవసరం. పదే పదే వస్తున్న ఈ గాయాలపై క్రికెట్ బోర్డు లోతైన సమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించాడు. బహుశా తాను భిన్నమైన ఆలోచనలు ఉన్న పాత తరం నుంచి రావడం వల్ల ఇలా అనిపిస్తుందేమో అని తనదైన శైలిలో కామెంట్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..